Vote కోసం పోటెత్తిన యువత

ABN , First Publish Date - 2021-11-23T15:09:22+05:30 IST

రాష్ట్రంలో కొత్త ఓటర్ల జాబితా తయారీలో భాగంగా గత రెండు రోజులుగా మార్పులు చేర్పుల పనులు జోరుగా సాగుతున్నాయి. ఇందుకోసం గత రెండు రోజుల పాటు (శని, ఆదివారాలు) నిర్వహించిన ప్రత్యేక

Vote కోసం పోటెత్తిన యువత

- 4 రోజుల్లో 6.14 లక్షల దరఖాస్తులు 

- 27, 28 తేదీల్లో మరోమారు ప్రత్యేక శిబిరం 


అడయార్‌(చెన్నై): రాష్ట్రంలో కొత్త ఓటర్ల జాబితా తయారీలో భాగంగా గత రెండు రోజులుగా మార్పులు చేర్పుల పనులు జోరుగా సాగుతున్నాయి. ఇందుకోసం గత రెండు రోజుల పాటు (శని, ఆదివారాలు) నిర్వహించిన ప్రత్యేక శిబిరాల్లో 8.59 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 6.14 లక్షల మంది తొలిసారి ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఉండటం గమనార్హం. ఇదిలావుంటే, ఈనెల 27, 28 తేదీల్లో కూడా ప్రత్యేక శిబిరాలను నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో సమగ్ర ఓటర్ల జాబితా తయారీలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను ఈనెల ఒకటో తేదీన విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 6,28,94,531 మంది ఓటర్లు ఉన్నారు. ఈ జాబితాను వెల్లడించినప్పటి నుంచి ఈ నెలాఖరు వరకు కొత్త ఓటర్ల పేర్లు నమోదు, ఓటర్ల పేర్లు తొలగింపునకు దరఖాస్తులు సమర్పించే వెసులుబాటు కల్పించారు. ఆ ప్రకారంగా 2022 జనవరి ఒకటో తేదీకి 18 యేళ్ళు పైబడిన యువత ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, ఓటర్ల జాబితా నుంచి తమ పేర్లను తొలగించేందుకు లేదా మార్పులు చేసుకునే అవకాశం కూడా కల్పించారు. అంతేకాకుండా, ఆఫీసులకు వెళ్ళేవారి కోసం ఈనెల 13, 14 తేదీల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఈ సమయంలో నగరంలో కుండపోత వర్షం కురుస్తుండటంతో పెద్దగా స్పందన రాలేదు. దీంతో ఈనెల 20, 21 తేదీల్లో ప్రత్యేక శిబిరాలను నిర్వహించారు. అలాగే, ఈనెల 27, 28 తేదీల్లో కూడా ఈ శిబిరాలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజుల్లో ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చడం లేదా తొలగింపు లేదా మార్పులు కోసం 8,59,580 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఓటర్ల జాబితాలో తమ పేర్లను చేర్చాలని కోరుతూ 6,14,166 మంది యువత దరఖాస్తు చేసుకోగా, పేర్లు తొలగించాలని కోరుతూ 1,00,518 మంది దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా ఇంటి చిరునామాను మార్చాలని 78,863 మంది, వార్డు మార్చాలని 66,033 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో యువతే అధికంగా ఉండటం గమనార్హం. 

Updated Date - 2021-11-23T15:09:22+05:30 IST