రాసలీలల సీడీ యువతి ప్రత్యక్షం

ABN , First Publish Date - 2021-03-14T07:59:10+05:30 IST

కర్నాటక మాజీ మంత్రి రమేష్‌ జార్కిహొళి ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘రాసలీల సీడీ’లో ఉన్న యువతి శనివారం రాత్రి అనూహ్యంగా ప్రత్యక్షమయ్యారు. పోలీసులు తనకు రక్షణ కల్పించాలని హోం మంత్రి

రాసలీలల సీడీ యువతి ప్రత్యక్షం

రక్షణ కల్పించాలని వీడియో సందేశం


బెంగళూరు, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): కర్నాటక మాజీ మంత్రి రమేష్‌ జార్కిహొళి ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘రాసలీల సీడీ’లో ఉన్న యువతి శనివారం రాత్రి అనూహ్యంగా ప్రత్యక్షమయ్యారు. పోలీసులు తనకు రక్షణ కల్పించాలని హోంమంత్రి బసవరాజబొమ్మైకు వీడియో ద్వారా విన్నవించారు. తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, ఉద్యోగం వస్తుందనే జార్కొహొళితో కలిశానన్నారు. పరువు, మర్యాద పూర్తిగా కోల్పోయానని, ప్రతిచోటా తన పట్ల చులకన భావం ఏర్పడిందన్నారు. ఇప్పటికే రెండు మూడు సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించానని, తన తల్లిదండ్రుల పరువు పోయిందన్నారు. వారూ రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించారన్నారు. తనకు ఏ రాజకీయ నేత మద్దతు లేదన్నారు. వీడియో ఎవరు చేశారు? ఎలా బయటికి వచ్చింది? అనేది కూడా తనకు తెలియదన్నారు. కాగా, ఆ యువతి వీడియో సందేశంపై జార్కొహొళి స్పందించారు. 


సీడీ విడుదలైన 12 రోజుల తర్వాత యువతి బయటికి వచ్చిందని, ఇది ఓ కుట్రలో భాగమన్నారు. ఆమె కొందరి చేతుల్లో కీలుబొమ్మగా మారి గంతులేస్తోందన్నారు. ఇన్నిరోజులు కనిపించని ఆమె ఇప్పుడే ఎందుకు బయటికి వచ్చిందని ప్రశ్నించారు. కాగా, ఈ నెల 2న రాసలీలల సీడీ బహిరంగం కావడంతో అప్పటి నుంచి యువతి పరారీలో ఉన్న విషయం తెలిసిందే. వివాదాన్ని విచారణ చేస్తున్న సిట్‌ అధికారులు ఆమె ఎక్కడికి వెళ్లారనే కోణంలో ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించారు. 2వ తేదీ రాత్రి బెంగళూరులోని ఇంటినుంచి బయటికి వెళ్లిన ఆమె నాలుగు రోజుల పాటు గోవాలో గడిపి ఇటీవల బెంగళూరు తిరిగివచ్చి నగర శివారులో గడిపినట్టు గుర్తించారు. అంతలోనే అనూహ్యంగా వీడియో రూపంలో ఆమె ప్రత్యక్షమయ్యారు. 


సీడీపై రమేశ్‌ జార్కిహొళి ఫిర్యాదు 

రాసలీలల సీడీ బహిరంగం కావడంతో మంత్రి పదవికి రాజీనామా చేసి కొన్ని రోజులపాటు అజ్ఞాతంలో గడిపిన రమేశ్‌ జార్కిహొళి ఎట్టకేలకు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీడీ విడుదలకు సంబంధించి శనివారం సదాశివనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆప్తుడు ఎంవీ నాగరాజ్‌ ద్వారా ఫిర్యాదు చేయించారు. రమేశ్‌జార్కిహొళి స్వయంగా రాసిన ఫిర్యాదును పోలీసులకు పంపారు. ఫిర్యాదులో ఎవరిపేరు నమోదు చేయలేదు. పరువు తీశారని, బ్లాక్‌ మెయిల్‌ చేశారని, రాసలీలల సీడీ నకిలీదని దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని కోరారు. కాగా, బెళగావిలో ఆయన సోదరుడు కేఎంఎఫ్‌ చైర్మన్‌ బాలచంద్ర జార్కిహొళి మీడియాతో మాట్లాడుతూ సీడీ కేసుకు సంబంధించి సూత్రధారి పేర్లను పోలీసులకు వివరిస్తానన్నారు. కింగ్‌పిన్‌లకు సహకరించినవారిని అదుపులోకి తీసుకున్నారని అయితే... తిమింగళాలు పట్టుబడలేదన్నారు. తాము గాలిలో గోడలు కట్టడం లేదని, న్యాయపోరాటం చేస్తామన్నారు. యువతి ఎవరెవరితో కలసి ఉన్న ఫొటోలు ఉన్నాయో... వాటన్నింటినీ సేకరిస్తున్నామని, పక్కా ఆధారాలను బహిరంగం చేస్తామన్నారు.


కాగా, సిట్‌ చీఫ్‌ సౌమేంద్ర ముఖర్జీ ఆదేశాలకు అనుగుణంగా తొలిరోజున ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారి ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీరిచ్చిన సమాచారం మేరకు మరో ఇరువురికోసం గాలింపులు చేపట్టారు.  శుక్రవారం 8 గంటలపాటు సుదీర్ఘంగా విచారించిన సిట్‌ నలుగురి ఫోన్‌లను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపింది. వీరి బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నారు. దేవనహళ్లి తాలూకా విజయపుర పట్టణం బసవేశ్వర కాలనీ వాసిని అదుపులోకి తీసుకుని హార్డ్‌డిస్క్‌, పెన్‌డ్రైవ్‌లను స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2021-03-14T07:59:10+05:30 IST