ఎమ్మెస్పీకి చట్టబద్ధత కల్పించండి
ABN , First Publish Date - 2021-11-21T07:13:48+05:30 IST
కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ చేసిన ప్రకటనను బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ స్వాగతించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు ఉంచారు. కనీస మద్దతు ధర....

మృతుల రైతు కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారమివ్వండి..
ప్రధాని మోదీకి వరుణ్ గాంధీ లేఖ
న్యూఢిల్లీ, నవంబరు 20: కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ చేసిన ప్రకటనను బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ స్వాగతించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు ఉంచారు. కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)కు చట్టబద్ధత కల్పించాలన్న రైతుల డిమాండ్‌ను అంగీకరించాలని, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రిని కోరారు. లేదంటే అన్నదాతల ఉద్యమం ఆగదంటూ శనివారం ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు. ‘‘సాగు చట్టాలను రద్దు చేయాలని, ఎమ్మెస్పీపై చట్టపరమైన హామీ ఇవ్వాలంటూ ఏడాది కాలంగా అన్నదాతలు చేస్తున్న ఉద్యమానికి ఫలితం దక్కింది. చట్టాలను రద్దు చేస్తామన్న మీ(ప్రధాని) ప్రకటనకు కృతజ్ఞతలు. అయితే ఈ ఉద్యమంలో 700 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారు. చట్టాల రద్దు నిర్ణయం ముందే తీసుకొని ఉంటే వారి ప్రాణాలు పోయేవి కాదు. కాబట్టి మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వండి.
రైతులపై నమోదు చేసిన కేసులన్నింటినీ కొట్టేయండి’’ అని వరుణ్ లేఖలో విజ్ఞప్తి చేశారు. ‘‘ఆందోళన చేస్తున్న రైతులపై చాలా మంది రాజకీయ నేతలు రెచ్చగొట్టే, అనుచిత వ్యాఖ్యలు చేశారు. అక్టోబరు 3న లఖీంపూర్ ఖీరీలో చోటుచేసుకున్న హింసలో రైతులు మరణించారు. ఆ విషాద ఘటన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఘటనపై పారదర్శకమైన విచారణ జరుగుతుంది’’ అని వరుణ్ తెలిపారు.
ఎన్నికల కోసమే చట్టాల రద్దు: సేన
కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ చేసిన ప్రకటనను అధికార దర్పానికి ఎదురైన ఓటమిగా శివసేన అభివర్ణించింది. రైతులు ఐకమత్యంగా చేసిన పోరాటానికి దక్కిన విజయమని పేర్కొంది. యూపీ, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో వెల్లడించింది. ప్రధాని ప్రకటనపై కాంగ్రెస్ నేత చిదంబరం విమర్శలు గుప్పించారు. కేబినెట్ ఆమోదం లేకుండానే చట్టాలను రూపొందించడం, రద్దు చేయడం బీజేపీ హయాంలో మాత్రమే జరుగుతాయని ఎద్దేవా చేశారు. కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించడాన్ని అమెరికా చట్టసభ సభ్యుడు ఆండీ లెవిన్ స్వాగతించారు. దాదాపు ఏడాది పాటు రైతులు నిరసనలు చేసిన తర్వాత ప్రభుత్వం స్పందించిందని, రైతుల ఐక్యతకు ఇది నిదర్శనమని ట్విటర్‌లో పేర్కొన్నారు.
కార్యాచరణపై నేడు నిర్ణయం: రైతు నేతలు
పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా రోజూ ట్రాక్టర్ మార్చ్ నిర్వహించాలని రైతు సంఘాల నేతలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే దీని ఉపసంహరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని నేతలు తెలిపారు. ఆదివారం రైతు సంఘాల నేతల కీలక సమావేశం జరగనుంది. ఆ భేటీలో ఎమ్మెస్పీ, ట్రాక్టర్ మార్చ్ తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. భవిష్యత్తు కార్యాచరణను కూడా ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
సిరా తప్ప.. చట్టాల్లో నలుపేంటి?: వీకే సింగ్
సాగు చట్టాలను రాయడానికి వాడిన సిరా తప్ప, వాటిలో నల్లగా ఉన్నదేంటని కేంద్ర మంత్రి వీకే సింగ్ రైతులను ప్రశ్నించారు. కొందరు రైతులు ఈ చట్టాలను రద్దు చేయాలని పట్టుబట్టడంపై విచారం వ్యక్తం చేశారు. తాను ఓ రైతు నేతతో ఈ చట్టాల గురించి మాట్లాడానన్నారు. ఇవి నల్ల చట్టాలు అంటున్నారు కదా? వీటిని రాయడానికి వాడిన సిరా తప్ప, నల్లగా ఏం ఉందని అడిగినట్లు చెప్పారు. ఆయన స్పందిస్తూ.. ‘ఈ చట్టాలు ఇప్పటికీ నల్లవే’ అని అన్నారని తెలిపారు.
గొలుసులతో బంధించుకుని..
సాగు చట్టాల రద్దు నిర్ణయంతో ఏడాదిగా ఢిల్లీ శివార్లలో సాగుతున్న రైతు ఉద్య మం విజయతీరం చేరింది. దీని వెనుక వేలాది రైతుల కష్టాలు, కన్నీళ్లు, త్యాగాలున్నాయి. ఆ త్యాగధనుల్లో ఒకడే హరియాణకు చెందిన కబాల్‌సింగ్. రోజూ ఉదయం 7 గంటలకే తెల్లటి కుర్తా, పైజమా, ఆకుపచ్చని తలపాగా, దానిపై భగత్‌సింగ్ బ్యాడ్జీ ధరించి తయారయ్యే కబాల్.. తనను తాను మెడ నుంచి కాళ్ల వరకు భారీ గొలుసులతో బంధించుకొని రైతుల ఆందోళన జరుగుతున్న సింఘు బోర్డర్‌లో తిరుగుతుంటారు. రాత్రి 9 గంటల వరకు ఇలాగే వినూత్నంగా నిరసన తెలిపే ఆయన.. నిద్ర పోయే ముందు మాత్రమే గొలుసులు విప్పుతారు. మళ్లీ ఉదయం 7 గంటలకు ఇలాగే తయారవుతారు. ఇలా.. ఏడాది నుంచి రోజూ నిరసన తెలుపుతున్నారు.
