వైష్ణవి నాట్యం... అద్భుతం, అమోఘం... ప్రముఖుల ప్రశంసలు

ABN , First Publish Date - 2021-08-26T01:16:23+05:30 IST

ఈ విద్యార్ధిని నాట్యం చేస్తుంటే చూసేవారు ముగ్ధులైపోవాల్సిందే. కరతాళ ధ్వనులతో అభినందించాల్సిందే. ఆ నృత్యాన్ని మళ్ళీమళ్ళీ చూడాలనుకోవాల్సిందే.

వైష్ణవి నాట్యం... అద్భుతం, అమోఘం... ప్రముఖుల ప్రశంసలు

హైదరాబాద్ : ఈ విద్యార్ధిని నాట్యం చేస్తుంటే చూసేవారు ముగ్ధులైపోవాల్సిందే. కరతాళ ధ్వనులతో అభినందించాల్సిందే. ఆ నృత్యాన్ని మళ్ళీమళ్ళీ చూడాలనుకోవాల్సిందే. యామినీరెడ్డి, దీపా శశిధరన్, అరుణిమ, మైథిలి వంటి అంతర్జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న కళాకారిణులకు దక్కే స్థాయిలో ప్రశంసాలు ఈ బాలికకు అందుతుండడం నిజంగా తెలుగువారికి గర్వకారణమే. హైదరాబాద్‌కు చెందిన ఈ బాలిక పేరు వఝల వైష్ణవి. కూచిపూడి నృత్యంలో అద్భుతమైన ప్రావీణ్యాన్ని సంపాదించింది. అంతేకాదు... ఆరవ ఏటనుంచే ప్రదర్శనలిస్తుండడం నిజంగా అభినందనీయమే. హైదరాబాద్ లోని అశోక్‌నగర్ లో ఉన్న సిద్ధేంద్ర కళాపీఠంలో నాట్యగురువులు ఆర్ సుధాకర్, కె. రత్న శ్రీల వద్ద శిష్యరికం చేస్తూ వైష్ణవి తన ప్రావీణ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరచుకుంటూ వస్తోంది. 


ఇదే క్రమంలో... తన తొమ్మిదవ ఏటనే కూచిపూడిలో రవీంద్రభారతిలో ఆరంగ్రేటం చేసింది. అప్పుడే... రెండున్నర గంటలపాటు నిర్విరామ ప్రదర్శననిచ్చిన వైష్ణవి... అందరిచేతా ‘శెభాష్’ అనిపించుకుంది. ఈ సందర్భంలో... వైష్ణవి... ఎనిమిది గేయాలకు తన నృత్యం ద్వారా మరింత శోభను సమకూర్చింది. ప్రముఖ చలనచిత్ర దర్శకుడు కె. విశ్వనాధ్ సహా మరెందరో ప్రముఖులు వైష్ణవి నృత్యప్రదర్శనలను చూసి అభినందించకుండా ఉండలేకపోయారంటే ఆశ్చర్యం కలుగక మానదు. దర్శకేంద్రుడు విశ్వనాధ్ ప్రశంసలందుకున్న తన నృత్యాన్ని ఉత్తరాఖండ్ వరద బాధితులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించిన వైష్ణవి... తన పెద్ద మనస్సును చాటుకుంది. ఇక ఇప్పటివరకు... వైష్ణవి... జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రెండు వందలకు పైగా ప్రదర్శనలనిచ్చి తెలుగు రాష్ట్రాలకు పేరు తెచ్చిపెట్టింది. హైదరాబాద్ లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తన పదమూడవ ఏట ‘సోలో’ ప్రదర్శననిచ్చిన వైష్ణవి... మరెందరో జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుల చేత ప్రశంసలనందుకుంది. 


ఇక 2017 లో చెన్నైలో జరిగిన ప్రపంచ తెలుగు సమాఖ్య సభల్లో ‘సంస్మరణీయ కళాకారిణి’ అవార్డును స్వీకరించింది. అంతేకాకుండా... వివిధ సంస్క్కతిక సమాఖ్యల ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శనల్లో... రాష్ట్ర, జాతీయ, అంతర్సాతీయ సంస్థల ద్వారా వైష్ణవి పలు అవార్డులు పొందడం విశేషం. ఈ క్రమంలోనే... బాల కళానిధి, బాల నాట్యప్రభ, అరుణ్‌రాం పురస్కారాలను పొందింది. అంతేకాకుండా 2019 లో... తెలంగాణ ప్రభుత్వం నుంచి ‘మెరిటోరియస్’ అవార్డును పొందింది. ఇవి ఇలా ఉంటే... వివిధ పోటీల్లో వచ్చిన బహుమతుల్లో కొంతమేర అనాధ శరణాలయాలకు, దేవస్థానం ట్రస్టులకు అందించిన వైష్ణవి... తన పెద్ద మనస్సును మరోమారు చాటుకుంది. ఇక... కేవలం కళలపట్లే కాకుండా చదువులోనూ రాణిస్తోంది వైష్ణవి. పదవ తరగతిలో ‘10 సీజీపీఏ’ సహా ఇంటర్మీడియెట్ లో 95 శాతం మార్కులను సాధించిన వైష్ణవి నిజంగా అభినందనీయురాలే. ప్రస్తుతం పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో కూచిపూడి న‌ృత్యంలో సర్టిఫికెట్ కోర్సును ఫస్ట్ క్లాస్‌లో పూర్తి చేసింది. కాగా... ఓ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించి భవిష్యత్తులో కూచిపూడి కళకు సేవలనందించాలని కోరుకుంటోంది. వైష్ణవి... ప్రస్తుతం సోమాజీగూడలోని విల్లా మేరీ మహిళా కళాశలలో డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరింది. Updated Date - 2021-08-26T01:16:23+05:30 IST