వాడని టీకాలు 23 కోట్లు

ABN , First Publish Date - 2021-12-08T07:45:45+05:30 IST

ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, బిహార్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో వినియోగించని టీకాలు 11 కోట్ల మేర నిల్వ ఉన్నాయని...

వాడని టీకాలు 23 కోట్లు

 5 రాష్ట్రాల్లోనే 11 కోట్ల డోసులు: కేంద్రం

న్యూఢిల్లీ, డిసెంబరు 7: ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, బిహార్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో వినియోగించని టీకాలు 11 కోట్ల మేర నిల్వ ఉన్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రాజ్యసభకు తెలిపింది. దేశ్యాప్తంగా 23 కోట్ల టీకా డోసులు అందుబాటులో ఉన్నాయని వివరించింది. యూపీలో ఒక్క డోసూ వేయించుకోని వారు 3.50 కోట్ల మంది ఉన్నారని.. బిహార్‌లో 1.89 కోట్ల మంది, మహారాష్ట్రలో 1.71 కోట్ల మంది, తమిళనాడులో 1.24 కోట్ల మంది ఉన్నారని వెల్లడించింది. ఒమైక్రాన్‌ వ్యాప్తిని అరికట్టడంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్‌ పవార్‌ తెలిపారు. కొత్త వైరస్‌ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ నిర్ధారణకు కన్షార్షియం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భారత్‌ ఇప్పటి వరకు 94 దేశాలకు 7.23 కోట్ల కొవిడ్‌ టీకా డోసులను పంపిణీ చేసినట్లు మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇక కొవిడ్‌ సంబంధింత మందులు, ఇతర సాయాన్ని 150 దేశాలకు అందించినట్లు తెలిపారు. వినియోగంలో ఉన్న 3 వ్యాక్సిన్ల కారణంగా మొత్తం 946 మరణాలు సంభవించాయని పేర్కొన్నారు.


ఉభయసభల్లో కొనసాగిన గందరగోళం..

పార్లమెంటు ఉభయసభల్లో మంగళవారం కూడా గందరగోళం కొనసాగింది. ఎంపీలపై సస్పెన్షన్‌ ఎత్తివేతకు విపక్షాలు పట్టుబట్టడంతో రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. జనన, మరణ ధ్రువీకరణ చట్టానికి సవరణలు చేయనున్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ తెలిపారు. పనామా, ప్యారడైజ్‌ పేపర్‌ లీక్స్‌లో భారత్‌కు చెందిన 930 సంస్థలకు రూ.20,353 కోట్ల ‘వెల్లడించని అప్పులు’ ఉన్నట్లు కేంద్రం తెలిపింది.

Updated Date - 2021-12-08T07:45:45+05:30 IST