వ్యాక్సిన్లు వేయించుకున్నా కరోనా ఎందుకొస్తోంది?
ABN , First Publish Date - 2021-12-26T07:20:26+05:30 IST
వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా కరోనా వైరస్ సోకుతుండటాన్ని మనం చూస్తున్నాం. ఇలా ఎందుకు జరుగుతోంది ...

అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనంలో కీలక వివరాలు
కణాలను కవచంగా మల్చుకుంటున్న కరోనా
యాంటీబాడీలకు చిక్కకుండా అంతర్గత వ్యాప్తి
ఒహియో, డిసెంబరు 25 : వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా కరోనా వైరస్ సోకుతుండటాన్ని మనం చూస్తున్నాం. ఇలా ఎందుకు జరుగుతోంది ? టీకాలు ఎందుకు పూర్తి రక్షణ కల్పించలేకపోతున్నాయి ? అనే ప్రశ్నలకు సమాధానాలను వెతికే దిశగా పరిశోధనలు చేస్తున్న అమెరికాలోని ఒహియో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు పలు కీలక అంశాలను గుర్తించారు. వైరాలజీ ప్రొఫెసర్ షాన్ లూల్యూ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం రూపొందించిన పరిశోధనా పత్రం ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ (పీఎన్‌ఏఎస్) జర్నల్‌లో ప్రచురితమైంది. టీకా తీసుకున్న తర్వాత మానవ రోగ నిరోధక వ్యవస్థ చైతన్యవంతం అవుతుంది. కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తే అడ్డుకునేందుకు సర్వ సన్నద్ధమై ఉంటుంది. అయినా మానవ రోగ నిరోధక వ్యవస్థను తప్పించుకునే ప్రయత్నంలో కరోనా వైరస్ సఫలమవడానికి ప్రధాన కారణం.. దాని వ్యాప్తి విధానమేనని శాస్త్రవేత్తలు గుర్తించారు. మానవ శరీరంలోని ఒక కణం నుంచి మరో కణానికి కరోనా వైరస్ అంతర్గతంగా వ్యాప్తి చెందుతున్న తీరు (సెల్ టు సెల్ ట్రాన్స్‌మిషన్) వల్లే.. దాన్ని రోగ నిరోధక వ్యవస్థ విడుదల చేసే యాంటీబాడీలు సైతం బంధించలేకపోతున్నాయని వెల్లడించారు. శరీర కణాల్లో అంతర్గతంగా వైరల్ ఇన్ఫెక్షన్లు ప్రబలే సందర్భాల్లో.. వాటిపై యాంటీబాడీల ప్రభావశీలత చాలా తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించారు. అధ్యయనంలో భాగంగా 2003 సంవత్సరంలో ప్రబలిన ‘సార్స్’ వ్యాధి, ఇప్పుడు ప్రబలుతున్న ‘కొవిడ్’ ఇన్ఫెక్షన్ల వ్యాప్తి విధానాలను పరిశోధకులు తులనాత్మకంగా పరిశీలించారు. ‘సెల్-ఫ్రీ ట్రాన్స్‌మిషన్’ పద్ధతిలో నాడు ‘సార్స్’ ఇన్ఫెక్షన్లు వ్యాపించగా, ఇప్పుడు ‘సెల్ టు సెల్ ట్రాన్స్‌మిషన్’ పద్ధతిలో కరోనా వైరస్ ప్రబలుతోందని పేర్కొన్నారు. నాడు సెల్-ఫ్రీ ట్రాన్స్‌మిషన్ పద్ధతిలో కణాల్లో వైరస్ వ్యాప్తి జరిగినందున సార్స్ త్వరగా అదుపులోకి వచ్చిందని వివరించారు. ఇప్పుడు సెల్ టు సెల్ ట్రాన్స్‌మిషన్ కారణంగా కరోనా అదుపులోకి రావడం కష్టసాధ్యంగా మారిందన్నారు.
సెల్ ఫ్రీ ఇన్ఫెక్షన్..
సెల్ ఫ్రీ ఇన్ఫెక్షన్‌లో మానవ శరీరంలోకి ప్రవేశించే వైరస్ కణాలను చుట్టుముడుతుంది. శరీరంలోని ప్లాస్మాలోనే స్వేచ్ఛగా తిరుగుతూ ఒక దాని తర్వాత ఒకటిగా కణాలకు ఇన్ఫెక్షన్‌ను వ్యాపింపచేస్తుంది. ఈక్రమంలో కణాల్లోకి చొరబడి వాటిని తమ స్థావరంగా మార్చుకోదు. సెల్ ఫ్రీ ఇన్ఫెక్షన్ ప్రక్రియ పూర్తి బహిరంగంగా జరగడం వల్ల, వైర్‌సను యాంటీబాడీలు సులువుగా గుర్తించి అదుపులోకి తెస్తాయి. 2003 సంవత్సరంలో సార్స్ ఇన్ఫెక్షన్లు అందువల్లే త్వరగా అదుపులోకి వచ్చాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.
సెల్ టు సెల్ ఇన్ఫెక్షన్..
సెల్ ఫ్రీ ఇన్ఫెక్షన్‌కు పూర్తి విరుద్ధంగా సెల్ టు సెల్ ఇన్ఫెక్షన్ ప్రబలుతుంది. వైరస్ నేరుగా మానవ శరీర కణంలోకి చొరబడుతుంది. కణం లోపలి యంత్రాంగాన్ని హైజాక్ చేసి లోపలే తన సంఖ్యను పెంచుకుంటుంది. చివరకు ఆ కణాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి, దాని నుంచి బయటకు వచ్చి చుట్టుపక్కల ఉండే ఇతర కణాలపైకి కూడా విరుచుకుపడుతుంది. ఇప్పుడు కరోనా వైరస్ ఈవిధంగానే ఒక కణం నుంచి మరో కణానికి వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ అంతర్గత ప్రక్రియ వల్లే యాంటీబాడీలు దాన్ని అడ్డుకోలేకపోతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.