నెలలో చిన్నారులపై టీకా ట్రయల్స్‌

ABN , First Publish Date - 2021-10-07T08:10:49+05:30 IST

నెల రోజుల్లో 2 నుంచి 6 ఏళ్ల చిన్నారులపై కొవావ్యాక్స్‌ కొవిడ్‌ టీకా ట్రయల్స్‌ను ప్రారంభించనున్నట్లు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ..

నెలలో చిన్నారులపై టీకా ట్రయల్స్‌

2-6 ఏళ్ల మధ్య వారిపై నిర్వహణ

ప్రస్తుతం 7-11 ఏళ్ల వారిపై ట్రయల్స్‌

2022 మొదట్లో అందుబాటులోకి టీకా!


పుణె, అక్టోబరు 6: నెల రోజుల్లో 2 నుంచి 6 ఏళ్ల చిన్నారులపై కొవావ్యాక్స్‌ కొవిడ్‌ టీకా ట్రయల్స్‌ను ప్రారంభించనున్నట్లు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) తెలిపింది. 12-17 ఏళ్ల మధ్య వయసువారిపై ట్రయల్స్‌లో టీకా సురక్షితమని తేలడంతో.. ప్రస్తుతం పుణె సహా దేశంలోని 10 నగరాల్లో ఏడు నుంచి 11 ఏళ్ల పిల్లలపై ట్రయల్స్‌ను నిర్వహిస్తోంది. వీరి విషయంలోనూ సత్ఫలితాలు వస్తే తదుపరి దశలో 2-6 ఏళ్ల మధ్య వారిపై ట్రయల్స్‌ చేపట్టనుంది. 17 ఏళ్లలోపు పిల్లలు మొత్తం 920 మందిపై ట్రయల్స్‌ను సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆగస్టులో ప్రారంభించింది. వయసుల వారీ మూడు బృందాలుగా(12-17), (7-11), (2-6) వీరిని వర్గీకరించింది. అమెరికా ఫార్మా దిగ్గజం రూపొందించిన నొవావ్యాక్స్‌ టీకాను కొవావ్యాక్స్‌ పేరిట భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఉత్పత్తి చేయనుంది. నవంబరులో వయోజనులకు, వచ్చే ఏడాది తొలినాళ్లలో పిల్లలకు ఈ టీకా అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.


రెండో రోజూ 20 వేలలోపే కేసులు

వరుసగా రెండో రోజూ దేశంలో కరోనా కేసులు 20 వేల దిగువనే నమోదయ్యాయి. మంగళవారం 18,833 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. ఇందులో కేరళ (9,700) కేసులే సగం ఉన్నాయి. మరోవైపు దేశంలో కొత్తగా 278 మంది చనిపోయారు. యాక్టివ్‌ కేసులు 2.46 లక్షలకు తగ్గాయి. గత 203 రోజుల్లో ఇవే అత్యల్పం. 14.09 లక్షల పరీక్షలు చేశారు. కాగా.. దేశంలో కరోనా టీకా పొందేందుకు సందేహిస్తున్నవారు 7 శాతమేనని ఆన్‌లైన్‌ కమ్యూనిటీ ప్లాట్‌ఫామ్‌ లోకల్‌ సర్కిల్స్‌ చేసిన అధ్యయనంలో తేలింది. 12,810 మందిపై సంస్థ ఈ అధ్యయనం చేసింది. ఇక, కరోనా లాక్‌డౌన్‌ ప్రపంచవ్యాప్తంగా కేన్సర్‌ రోగుల శస్త్రచికిత్సపై ప్రభావం చూపిందని లాన్సెట్‌ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఆంక్షల కారణంగా ప్రతి ఏడుగురు క్యాన్సర్‌ బాధితుల్లో ఒకరు శస్త్రచికిత్సకు దూరం అయ్యారని పేర్కొంది. మరోవైపు ఐరోపా తప్ప మిగతా ఖండాల్లో గత వారం కరోనా కొత్త కేసులు తగ్గాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అటు రష్యాలో కరోనా మరణాలు పెరుగుతూ పోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో బుధవారం 929 మంది ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - 2021-10-07T08:10:49+05:30 IST