టీకా వద్దంటే..కరోనాను రమ్మన్నట్లే!

ABN , First Publish Date - 2021-10-19T07:01:24+05:30 IST

అత్యంత ప్రభావవంతమైన ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలను ఉద్యమ స్థాయిలో సగం జనాభాకు వేసినఅగ్రరాజ్యం అమెరికాలో అక్టోబరు 12న.....

టీకా వద్దంటే..కరోనాను రమ్మన్నట్లే!

అమెరికా, యూకే, రష్యా తదితర దేశాల్లో

మందకొడిగా సాగుతున్న టీకా కార్యక్రమం

ఒక దశ వరకే వేగంగా జరిగిన వ్యాక్సినేషన్‌

టీకా తీసుకోవడానికి చాలా మంది విముఖం

ఆ సమయంలో డెల్టా వ్యాప్తి.. భారీగా కేసులు

మనదేశంలో ఇప్పటికే 98 కోట్ల డోసుల టీకా

టీకాపై సుముఖత.. ఏప్రిల్‌ నుంచి వేగం

మూడు రెట్లు పెరిగిన టీకాల ఉత్పత్తి

సెప్టెంబరు నాటికి పతాకస్థాయికి వ్యాక్సినేషన్‌

అందుకే కేసుల తగ్గుముఖం: వైద్యనిపుణులు

(సెంట్రల్‌ డెస్క్‌)


అత్యంత ప్రభావవంతమైన ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలను ఉద్యమ స్థాయిలో సగం జనాభాకు వేసినఅగ్రరాజ్యం అమెరికాలో అక్టోబరు 12న 92 వేల కేసులు వచ్చాయి. 13న లక్షకు పైగా కేసులు. 14, 15 తేదీల్లో 90 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అక్టోబరు 16, 17 తేదీల్లో మాత్రమే అక్కడ 50 వేలలోపు కేసులొచ్చాయి. మరణాలూ నిత్యం వెయ్యికిపైగానే నమోదవుతున్నాయి! అటు.. కరోనాను బాగా కట్టడి చేసిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల్లో కూడా.. డెల్టా వేరియంట్ వల్ల మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశమైన బ్రిటన్‌లో కూడా ఇంకా రోజువారీ కేసులు 30-40 వేల దాకా నమోదవుతున్నాయి. రష్యాలో కూడా రోజుకు 30 వేలకు పైగా కేసులు, దాదాపు వెయ్యి దాకా కరోనా మరణాలు నమోదవుతున్నాయి.


కానీ.. 130 కోట్లకుపైగా జనాభా, అధిక జనసాంద్రత ఉన్న మనదేశంలో మాత్రం కేసుల సంఖ్య 8 నెలల కనిష్ఠానికి తగ్గిపోయింది. కరోనా మరణాలూ అంతేస్థాయిలో తగ్గాయి. రెండో వేవ్‌లో రోజుకు 4 లక్షల కేసుల నుంచి 20 వేలలోపునకు కేసుల సంఖ్య పడిపోయింది. ఎందుకిలా? పాశ్చాత్య దేశాల్లో వ్యాక్సినేషన్‌ బాగా జరిగినా కేసులు, మరణాల సంఖ్య ఎందుకు ఎక్కువగా ఉంది? మనదేశంలో ఎందుకు తక్కువగా ఉంది? అంటే.. ఏ వైరస్‌ వ్యాప్తి అయినా తగ్గడానికి ప్రధామైన కారణం హెర్డ్‌ ఇమ్యూనిటీ. అంటే.. కరోనాలాంటి వైరస్‌లను నిరోధించే యాంటీబాడీలు అత్యధికుల్లో రావడం. ఈ హెర్డ్‌ ఇమ్యూనిటీ రెండు రకాలుగా సాధ్యమవుతుంది. ఒకటి.. సహజంగా జనాభాలో అత్యధికులు వైరస్‌ బారిన పడడం ద్వారా. రెండు.. వ్యాక్సిన్‌ ద్వారా. మనదేశంలో కేసుల సంఖ్య భారీగా తగ్గడానికి కారణం సహజంగా వచ్చిన హెర్డ్‌ ఇమ్యూనిటీ అని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు.


మరికొందరేమో.. కేసులు తగ్గడానికి ప్రధాన కారణం వ్యాక్సినేషనేనని.. ఇంకా టీకా వేయించుకోనివారు ఇప్పటికైనా వేయించుకోవాలని సలహా ఇస్తున్నారు. ‘‘భారతదేశంలో హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చిన సంకేతాలు కనిపించట్లేదు. ఐసీఎంఆర్‌ చేసిన సీరో సర్వేల ఆధారంగానే ఈ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసలు, హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చిందనడానికి సీరో సర్వేలు మాత్రమే ఆధారం కాదు’’ అని ట్రూడో ఇన్‌స్టిట్యూట్‌ (న్యూయార్క్‌)లోని ‘వైరల్‌ డిసీజెస్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రాన్స్‌లేషనల్‌ సైన్స్‌ ప్రోగ్రామ్‌’ విభాగం చీఫ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ ప్రియ లూథ్రా తెలిపారు. యూకే, ఇజ్రాయెల్‌ వంటి దేశాల్లో నిర్వహించిన సీరోసర్వేల్లో కూడా దేశ ప్రజల్లో అత్యధికుల శరీరాల్లో యాంటీబాడీలు కనిపించాయని.. అయినప్పటికీ ఆ రెండు దేశాల్లో డెల్టా వేరియంట్‌ వల్ల కేసుల సంఖ్య భారీగా పెరిగిందని ఆమె గుర్తుచేశారు. వైర్‌సలో ఉత్పరివర్తనాలు (మ్యుటేషన్లు) వచ్చే కొద్దీ రీ-ఇన్ఫెక్షన్లు, కేసులు పెరుగుతాయని ఆమె గుర్తుచేశారు. కొత్త వేరియంట్ల బారి నుంచి కాపాడుకునే ఒకే ఒక్క మార్గం వ్యాక్సినేషనేనని ఆమె తేల్చిచెప్పారు. 


ఇందుకే భారత్‌లో తగ్గుముఖం..

సోమవారానికి.. అంటే, అక్టోబరు 18 నాటికి మనదేశంలో 98 కోట్ల డోసుల టీకాలిచ్చారు. అమెరికాలో 40.8 కోట్ల డోసులు.. యూకేలో 25.8 కోట్ల డోసుల టీకాలిచ్చారు. సంఖ్యపరంగా తక్కువగా ఉన్నా ఆ దేశాల జనాభా లెక్క ప్రకారం చూస్తే గణనీయంగా ఇచ్చినట్టే. ఇంకా చెప్పాలంటే.. అమెరికాలో 50 శాతానికి పైగా ప్రజలు రెండు డోసుల టీకాలు వేసుకున్నారు. యూకేలో 66.7ు ప్రజలు రెండు డోసులూ వేసుకున్నారు. మనదేశంలో రెండు డోసులూ వేసుకున్నవారు జనాభాలో 20.3 శాతమే. అయినా కేసుల సంఖ్య ఈ తేడా ఎందుకు ఉందంటే.. వ్యాక్సినేషన్‌ జరిగిన తీరు, డెల్టా వేరియంట్‌ విజృంభించిన సమయాల్లో తేడాలే అందుకు కారణం. పాశ్చాత్యదేశాల్లో తొలుత వేగంగా టీకాలు వేశారు. కానీ, ఒక దశ దాటాక ఆ వేగం తగ్గిపోయింది. అదే సమయంలో డెల్టా వేరియంట్‌ విజృంభించింది. దీంతో కేసులు పెరుగుతున్నాయి. మనదేశంలో ఇందుకు భిన్నంగా తొలుత టీకా కార్యక్రమం నెమ్మదిగా సాగింది. చాలా మంది టీకా వేయించుకోవడానికి ముందుకు రాలేదు. కానీ, వ్యాక్సిన్‌ వేయించుకున్నవారిలో ఎలాంటి దుష్ప్రభావాలూ కనిపించకపోవడంతో ప్రజల్లో టీకా పట్ల సుముఖత పెరిగింది. అదే సమయంలో డెల్టా వేరియంట్‌ విజృంభించడంతో వ్యాక్సినేషన్‌ వేగం పుంజుకుంది. డెల్టా బారిన పడ్డవారికి, వ్యాక్సిన్లు వేయించుకున్నవారికి.. ఇలా పెద్ద ఎత్తున ప్రజలకు యాంటీబాడీలు రావడంతో వైరస్‌ ఉధృతి తగ్గిపోయిందని వైద్యనిపుణులు చెబుతున్నారు. పుంజుకున్న వ్యాక్సినేషన్‌ వేగానికి దీటుగా దేశంలో టీకాల ఉత్పత్తి కూడా గతంతో పోలిస్తే మూడు రెట్లు పెరిగిందని.. ఫలితంగా సెప్టెంబరు నాటికి వ్యాక్సినేషన్‌ పతాకస్థాయికి చేరుకుందని గుర్తు చేస్తున్నారు. 
మూడో ముప్పు లేనట్టే!

మనదేశంలో కరోనా మొదటి వేవ్‌కు కారణం చైనా నుంచి వచ్చిన కరోనా వైరస్‌ కాగా.. సెకండ్‌ వేవ్‌కు కారణం డెల్టా వేరియంట్‌. ఆ స్థాయిలో మరో కొత్త వేరియంట్‌ వస్తేనే మూడో వేవ్‌ ముప్పు ఉంటుంది. కానీ, ఇప్పటిదాకా చేసిన జీనోమిక్‌ సీక్వెన్సింగ్‌, ఇతర అధ్యయనాల ఆధారంగా.. వైరస్‌ ఆ స్థాయిలో ఉత్పరివర్తనం చెందే అవకాశాలు లేవని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఫలితంగా మూడో వేవ్‌ ముప్పు ఉండకపోవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ‘‘డెల్టా వేరియంట్‌, దాని ఉపవర్గాల వ్యాప్తి వ్యాక్సినేషన్‌ వల్ల తగ్గుతోంది. కాబట్టి ఆ వేరియంట్‌లో ఉత్పరివర్తనాలు వచ్చే అవకాశాలు దాదాపు మృగ్యం’’ అని మనదేశంలో జీనోమిక్‌ సీక్వెన్సింగ్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ వి. రవి తెలిపారు. ఎంయు, సి.1.2 వంటి కొత్త వేరియంట్లు దక్షిణ అమెరికా, దక్షిణాఫ్రికా వంటి దేశాలకే పరిమితమయ్యాయని... అవి మనదేశానికి వచ్చే అవకాశం తక్కువని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ కొత్త వేరియంట్‌ వచ్చినా.. డెల్టా అంత ప్రాణాంతకంగా ఉండదని పేర్కొన్నారు.


స్పుత్నిక్‌ను నమ్మని రష్యన్లు!

ప్రపంచంలోనే తొలి కరోనా టీకా స్పుత్నిక్‌ను రూపొందించిన రష్యాలో.. వైరస్‌ విలయతాండవం ఎలా చేస్తోంది? అంటే.. ప్రజలు వ్యాక్సిన్‌ను విశ్వసించకపోవడం వల్లనేనని రష్యాకు చెందిన బయోఎథిసిస్ట్‌ డాక్టర్‌ అన్నా గోత్లిబ్‌ వంటి నిపుణులు చెబుతున్నారు. తమ దేశంలో తయారైన ‘స్పుత్నిక్‌ వి’ టీకానే కాదు.. ఇతర దేశాల టీకాలనూ ప్రజలు నమ్మట్లేదని, అందుకే వ్యాక్సిన్‌ వేయించుకోవట్లేదని ఆమె ఆవేదన వెలిబుచ్చారు. కరోనాకు తొలి టీకా రూపొందించిన రష్యాలో ఇప్పటిదాకా రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకున్నవారు ఆ దేశ జనాభాలో 29 శాతం. ఒక్క డోసు మాత్రమే వేయించుకున్నవారు 33ు మంది. ఇటీవల రష్యాలో జరిపిన ఒక సర్వేలో పాల్గొన్న ప్రజల్లో..  33ు మంది టీకా వేయించుకోవడానికి విముఖత చూపారు. అలాగే.. ప్రపంచమంతా కరోనా నిబంధనలను కఠినంగా పాటించిన సమయంలో కూడా రష్యాలో ఆ నిబంధనల అమలు పెద్దగా జరగలేదు.   నిబంధనలు అమలు జరగక, వ్యాక్సినేషన్‌ నత్తనడకన నడుస్తున్న దశలో.. డెల్టా వేరియంట్‌ వ్యాపించడంతో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పుడక్కడ వైరస్‌ బారిన పడి ఆస్పత్రుల్లో చేరుతున్నవారిలో అత్యధికులు ఒక్క డోసు టీకా కూడా వేయించుకోనివారేనని గణాంకాలు చెబుతున్నాయి.Updated Date - 2021-10-19T07:01:24+05:30 IST