విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లలో కరోనా యాంటీజెన్ టెస్టులు
ABN , First Publish Date - 2021-03-18T12:20:00+05:30 IST
దేశంలోని చాలా రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో...
లక్నో: దేశంలోని చాలా రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కరోనా కట్టడికి నూతన గైడ్‌లైన్స్ విడుదల చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా అధికారులకు, వైద్యశాఖాధికారులకు లేఖలు రాశారు. దీనిప్రకారం రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాల్లోనూ, రైల్వే స్టేషన్లలోనూ ప్రయాణికులకు యాంటీజెన్ టెస్టులు చేపట్టాలని ఆదేశించారు.
అలాగే కరోనా లక్షణాలు కనిపించినవారికి ఆర్టీపీసీఆర్ టెస్టుల కోసం నమూనాలు సేకరించాలని తెలిపారు. కరోనా కేసులు కనిపిస్తున్న ప్రాంతాలలో ఫ్రంట్‌లైన్ వర్కర్స్ ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించాలని కోరారు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రంలోనికి వస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఇదేవిధంగా ప్రజలంతా సోషల్ డిస్టెన్సింగ్ పాటించేలా చూడాలని, మాస్కులు ధరించడంతోపాటు కోవిడ్ ప్రొటోకాల్ పాటించేలా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. కాగా రాష్ట్రంలోని గజియాబాద్ లో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న దృష్ట్యా మే 25 వరకూ 144 సెక్షన్ విధించారు.