అంగుళం ఆక్రమించినా తగిన సమాధానమిస్తాం
ABN , First Publish Date - 2021-11-21T07:16:26+05:30 IST
భారత్‌లో అంగుళం భూభాగాన్ని దురాక్రమించేందుకు యత్నించినా ఆయా దేశాలకు తగిన సమాధానమిస్తామని రక్షణమంత్రి రాజ్‌నాథ్ తాజాగా హెచ్చరించారు. ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్....

పొరుగు దేశాలకు రాజ్‌నాథ్ హెచ్చరిక
పితోరాగఢ్, నవంబరు 20: భారత్‌లో అంగుళం భూభాగాన్ని దురాక్రమించేందుకు యత్నించినా ఆయా దేశాలకు తగిన సమాధానమిస్తామని రక్షణమంత్రి రాజ్‌నాథ్ తాజాగా హెచ్చరించారు. ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లా ఝావుల్ఖేత్ మూనాకోట్లో షహీద్ సమ్మాన్ యాత్రను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పొరుగుదేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. ‘‘అందరితో మంచిగా ఉండటం భారత సంస్కృతి. పరిధి దాటితే.. మనం సరిహద్దులు కూడా దాటి వైమానిక దాడులు, సర్జికల్ స్ట్రైక్స్ చేయగలమని ఇప్పటికే పాక్‌కు ఒక బలమైన సందేశాన్ని పంపించాం. పరిస్థితి ఏమాత్రం అర్థం కాని మరో పొరుగు దేశం(చైనాను ఉద్దేశించి) మనకు ఉంది. దానికి నేనో విషయాన్ని స్పష్టీకరించాలనుకుంటున్నా.
మా భూభాగంలో అంగుళం ఆక్రమించుకోవాలని చూసినా.. భారత్ అందుకు తగిన సమాధానం ఇస్తుంది’’ అని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. ఇక.. రక్షణ శాఖ ప్రస్తుత సిబ్బందితో పాటు విశ్రాంత అధికారులకు సంబంధించిన అన్ని సమస్యల్ని పరిష్కరించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ‘ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్’ను ప్రధాని మోదీ అమలు చేశారని కొనియాడారు. ఇదిలా ఉండగా.. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందన్న నిజాన్ని ప్రధాని మోదీ అంగీకరించాలంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన హిందీలో ట్వీట్ చేశారు. సరిహద్దుల్లో చైనాతో కేంద్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరితో వ్యవహరిస్తోందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.