ఉత్తరాఖండ్ విషాదం: 2013 ప్రళయానికి భిన్నంగా...

ABN , First Publish Date - 2021-02-08T12:57:41+05:30 IST

ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో చోటు చేసుకున్న జల ప్రళయం....

ఉత్తరాఖండ్ విషాదం: 2013 ప్రళయానికి భిన్నంగా...

చమోలీ: ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో చోటు చేసుకున్న జల ప్రళయం.... 2013, జూన్ 16న జరిగిన కేదార్‌నాథ్ ఉపద్రవాన్ని గుర్తుకు తెచ్చింది. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు జరిగిన ప్రమాదంలో ప్రకృతి కాస్త దయ చూపిందని చెప్పుకోవచ్చు. గతంలో మాదిరిగా కాకుండా పగటిపూట ఈ ప్రమాదం చోటుచేసుకోవడం కాస్త ఉపశమనం కలిగించే అంశమని విశ్లేషకులు అంటున్నారు. ఈసారి  ప్రమాదం జరిగిన సమయంలో వాతావరణం కాస్త అనుకూలంగా ఉండటంతో, సహాయక చర్యలు వేగంగా చేపట్టగలిగారు.


దీనికితోడు వరదలకు సంబంధించిన వదంతులను నమ్మవద్దని స్థానిక అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఫలితంగా సాయంత్రానికల్లా అలకనంద, గంగానది తీరప్రాంత గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించగలిగారు. అయితే 2013 జూన్ 16న సంభవించిన జల ప్రళయం గుర్తుకు రాగానే అందరిలోనూ భయం కలుగతుంది. నాటి ప్రమాదంలో నాలుగువేలమంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కొన్ని వేలమంది నిరాశ్రయులయ్యారు. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. అయితే నిన్నటి ప్రమాద సమయంలో వాతావరణం భయానకంగా లేదు. హెలికాప్టర్లు తిరిగేందుకు అనుకూలంగా ఉంది. ఫలితంగా సహాయక చర్యలు వేగంగా జరిగేందుకు అవకాశం కలిగింది. అదే 2013లో ప్రమాదం జరిగిన సమయంలో భారీ వర్షాల కారణంగా వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేకపోవడంతో వేలమంది ప్రాణాలు గంగలో కలసిపోయాయి. దీనికితోడు అప్పట్లో ప్రమాదం రాత్రివేళ సంభవించడంతో వెంటనే సహాయక చర్యలు చేపట్టలేకపోయారు. ఈ సారికూడా కొండచరియలు విరిగిపడిన కారణంగానే ప్రమాదం సంభవించినప్పటికీ ఉదయం పూట ఇది జరగడంతో అధికారులు వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టగలిగారు.

Updated Date - 2021-02-08T12:57:41+05:30 IST