ఆయుర్వేద డాక్టర్ల అల్లోపతి వైద్యానికి ఉత్తరాఖండ్ అనుమతి..!

ABN , First Publish Date - 2021-06-21T20:16:18+05:30 IST

అత్యవసర సందర్భాల్లో ఆయుర్వేద డాక్టర్లు రోగులకు అల్లోపతి మందులను సూచించేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం సోమవారం నాడు అనుమతించింది.

ఆయుర్వేద డాక్టర్ల అల్లోపతి వైద్యానికి ఉత్తరాఖండ్ అనుమతి..!

డెహ్రాడూన్: అత్యవసర సందర్భాల్లో ఆయుర్వేద డాక్టర్లు రోగులకు అల్లోపతి మందులను సూచించేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం సోమవారం నాడు అనుమతించింది. ఈ విషయమై ముఖ్యమంత్రి తీరిత్ సింగ్ తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్ర ఆయుష్ శాఖ మంత్రి హరక్ సింగ్ రావత్ హర్షం వ్యక్తం చేశారు. ఆయుర్వేద డాక్టర్లు ఎంతో కాలంగా చేస్తున్న డిమాండ్‌పై సీఎం సానుకూల నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు. ‘‘అత్యవసర సందర్భాల్లో రోగులకు అల్లోపతి మందులు సూచించేందుకు తమకు అవకాశం ఇవ్వాలన్న ఆయుర్వేద డాక్టర్ల అభ్యర్థనను మేం అనుమతిస్తున్నాం.  అల్లోపతి వైద్యసదుపాయాలు లేని మారుమూల ప్రాంతాల ప్రజలకు ఈ నిర్ణయం లాభిస్తుందని మేం ఆశిస్తున్నాం’’ అని ఆయన తెలిపారు. ఈ రెండు వైద్యవిధానాలపై దేశంలో ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 


కాగా.. ఉత్తరాఖండ్ నిర్ణయంపై అల్లోపతి వైద్యుల సంఘం ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఏమ్ఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని చట్టవ్యతిరేకమైనదిగా అభివర్ణించింది. ప్రభుత్వం నిర్ణయంలో పరస్పర వ్యతిరేక అభిప్రాయాలు ఇమిడి ఉన్నాయని ఐఎమ్ఏ ఉత్తరాఖండ్ అధ్యక్షుడు డా. అరవింద్ శర్మ తెలిపారు. ‘‘ఆయుర్వేద డాక్టర్లు అల్లోపతి చికిత్స చేసేటట్టైతే..అల్లోపతిపై ఇన్ని అనుమానాలు ఎందుకు’’ అని ఆయన ప్రశ్నించారు. బాబా రామ్‌దేవ్ ఇటీవల ‘అల్లోపతి వైద్యం ఓ పిచ్చి శాస్త్రం’ అంటూ వ్యాఖ్యానించడం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-06-21T20:16:18+05:30 IST