అభిశంసన షురూ!
ABN , First Publish Date - 2021-01-12T09:07:51+05:30 IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అభిశంసించే ప్రక్రియను దిగువసభ సోమవారంనాడు లాంఛనంగా ఆరంభించింది.

తీర్మానం తెచ్చిన డెమొక్రాట్లు
ఒకే టర్మ్‌లో రెండోసారి ట్రంప్‌కు పరాభవం
25వ సవరణ ప్రయోగానికి పెన్స్ నో..?
వాషింగ్టన్ , జనవరి 11: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అభిశంసించే ప్రక్రియను దిగువసభ సోమవారంనాడు లాంఛనంగా ఆరంభించింది. కేపిటల్ భవనంపై తిరుగుబాటును రెచ్చగొట్టినందుకు అభిశంసిస్తున్నట్లు పేర్కొంటూ ఓ తీర్మానాన్ని డెమొక్రాట్ సభ్యులు ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. దీనిపై ఈ వారాంతంలోగా ఓటింగ్ జరుగుతుందని భావిస్తున్నారు. ఈ చర్యతో అమెరికా చరిత్రలో తొలిసారిగా- ఒకే టర్మ్‌లో రెండోసారి అభిశంసనకు గురవుతున్న అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నిలిచిపోనున్నారు. ‘‘ఎన్నికల్లో తానే గెలిచినట్లు పదేపదే ప్రకటించుకున్నారు. జార్జియా సెనెట్ ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లు తేల్చండని, తనకు ఓట్లు పడేట్లు చూడండని అక్కడి రిపబ్లికన్ నేతలకు దిశానిర్దేశం చేసి ప్రజాస్వామ్య ప్రక్రియ నైతికతను దెబ్బతీశారు. జనవరి 6న కేపిటల్ భవనంపై తిరుగుబాటు జరపండని మద్దతుదారులను కోరడం ద్వారా ప్రజాస్వామ్యానికే ప్రమాదకారిగా మారారు.
అమెరికా భద్రతను ప్రమాదంలోకి నెట్టారు. సజావుగా అధికార మార్పిడి జరగకుండా అడ్డంకులు కల్పించడానికి ప్రయత్నించారు. అలాంటి వ్యక్తి ఇక ఎంతకాలం అఽధ్యక్షుడిగా కొనసాగేందుకు అర్హుడు కాదు’ అని డెమొక్రాట్ సభ్యులు- డేవిడ్ సిసిలీన్ (రోడ్ ఐలండ్స్), జేమీ రస్కిన్ (మేరీలాండ్), టెడ్ లియు (కాలిఫోర్నియా) ప్రవేశపెట్టిన ఆ తీర్మానం పేర్కొంది. ఈ తీర్మానంపై బుధవారమే ఓటింగ్ జరిపేందుకు యత్నిస్తామని ప్రతినిధుల సభ మెజారిటీ పక్ష నేత స్టెనీ హోయర్ తెలిపారు. గురువారం సెనెట్‌కు పంపుతామన్నారు. ఎంత వేగంగా దీన్ని పంపినా సెనెట్ ఈనెల 20లోగా అంటే జో బైడెన్ ప్రమాణస్వీకారం జరిగేలోగా ఆమోదించడం కష్టమేనని తెలుస్తోంది. అయితే ప్రమాణస్వీకారం పూర్తయ్యాక కూడా దీనిని చేపట్టే దిశగా డెమొక్రాట్లు ప్రయత్నాలు జరుపుతున్నారు. ఈ తీర్మానంతో పాటు 25వ రాజ్యాంగ సవరణను ప్రయోగించి అధ్యక్షుణ్ణి పదవీచ్యుతుణ్ని చేయాలన్న ప్రతిపాదననూ డెమొక్రాట్లు ముందుకు తీసుకొచ్చారు. ఈ సవరణను వినియోగించే అధికారం ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, మంత్రిమండలిలో మెజారిటీ సభ్యులకు ఉంటుంది. 24 గంటల్లోగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ నాన్సీ పెలోసీ పెన్స్‌కు స్పష్టం చేశారు. అయితే పెన్స్ అందుకు విముఖంగా ఉన్నట్లు సమాచారం. కాగా- అభిశంసన ప్రక్రియకు సైతం విముఖత చూపిన కొత్త అధ్యక్షుడు జో బైడెన్- ‘అమెరికా యునైటెడ్’ అన్నది తమ లక్ష్యమని మరోమారు స్పష్టీకరించారు.
సీఐఏ డైరెక్టర్‌గా బర్న్స్‌ను ఎంపిక చేసిన బైడెన్
అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టనున్న జో బైడెన్ సోమవారం సీనియర్ దౌత్యవేత్త విలియమ్ బర్న్స్ (64)ను సెంట్రల్ ఇంటెలిజన్స్ ఏజెన్సీ (సీఐఏ) డైరెక్టర్‌గా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో బర్న్స్ రష్యా, జోర్డాన్ దేశాల్లో అమెరికా రాయబారిగా పనిచేశారు.