‘మహా’ విషాదం

ABN , First Publish Date - 2021-07-24T07:57:44+05:30 IST

మహారాష్ట్రలో వర్షాల బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అతి భారీ వర్షాల ధాటికి రాయ్‌గఢ్‌, రత్నగిరి, సతారా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడంతో.

‘మహా’ విషాదం

  • భారీ వర్షాలకు వేర్వేరు ఘటనల్లో 136 మంది దాకా దుర్మరణం
  • రాయ్‌గఢ్‌జిల్లా తలై గ్రామంలో విరిగిపడ్డ భారీ కొండచరియ
  • ఆ ఒక్క ఘటనలోనే 47 మంది మృతి.. 48 గంటల్లో 129 మరణాలు
  • కర్ణాటకలోనూ కుండపోత.. కృష్ణా బేసిన్‌లో పొంచి ఉన్న వరద ముప్పు


ముంబై, జూలై 23: మహారాష్ట్రలో వర్షాల బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అతి భారీ వర్షాల ధాటికి రాయ్‌గఢ్‌, రత్నగిరి, సతారా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడంతో.. వేర్వేరు ఘటనల్లో 136 మంది దాకా చనిపోయినట్టు సమాచారం. రాయ్‌గఢ్‌ జిల్లాలోని తలై గ్రా మంలో.. గురువారం సాయంత్రం దాదాపుగా 60 మీటర్ల నిడివి గల కొండరాయి విరిగి కింద పడిపోయింది. ఆ ప్రదేశం లో 30 ఇళ్ల దాకా ఉన్నాయి. ఈ ఘటనలో ఆ ఇళ్లు మొత్తం ధ్వంసమై, 47 మంది దుర్మరణం పాలయ్యారని.. వారి మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీసినట్టు సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. శిథిలాల్లో చిక్కుకుపోయిన మిగతావారిని కాపాడేందుకు జాతీయ విపత్తు స్పందన దళాలు, పోలీసులు, జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. గురువారం పొద్దుపోయాక ఈ విషాదం జరిగిందని.. రోడ్లన్నీ వరద ముంపునకు గురవడంతో సహాయక బృందాలు అక్కడికి చేరుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని రాయ్‌గడ్‌ జిల్లా కలెక్టర్‌ నిధి చౌదరి తెలిపారు. శుక్రవారం ఉదయం నుంచి యుద్ధప్రాతిపదికన సహాయకచర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. అలాగే సతారా జిల్లాలో కొండ చరియలు మరో 27 మంది మరణించారు. ముంబైలోని గోవండిలో శుక్రవారం ఉదయాన్నే ఒక ఇల్లు కూలిపోవడంతో.. నలుగురు మరణించారు. 


అటు రత్నగిరి జిల్లాలో విరిగిపడ్డ కొండచరియల కింద 10 మంది దాకా చిక్కుకుపోయినట్టు సమాచారం. కొల్లాపూర్‌ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఒక బస్సు వరద తాకిడికి నదిలో కొట్టుకుపోయింది. పోలీసులు, అధికారులు వారిస్తున్నా వినకుండా డ్రైవర్‌ ఆ బ స్సును వంతెనపైకి నడిపించాడు. అప్పటికే.. చికోడీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే, కొద్ది క్షణాల ముందే అందులో ఉన్న 11 మందిని అధికారులు కాపాడడంతో పెనుముప్పు తప్పినట్టయింది. సతారా జిల్లాలో వర్షాల కారణంగా ఆరుగురు మరణించగా.. ముగ్గురు వరదలో గల్లంతయ్యారు. 


అంబేగఢ్‌లో 8 ఇళ్లు కూలి 14 మంది వాటిలో చిక్కుకుపోయారు. అలాగే మిరాగావ్‌లో మూడు ఇళ్లు కూలిపోవడంతో 10 మంది చిక్కుకుపోయారు. వశిష్టి నది పరీవాహక ప్రాంతంలో అక్రమ కట్టడాల కారణంగా పెద్ద ఎత్తున వరద నీరు చిప్లున్‌ పట్టణంలోకి ప్రవహించింది. దాదాపు 12 అడుగుల మేర వరదనీరు చేరుకుంది. ఆ వరదలో చిక్కుకుపోయిన 56 మందిని అధికారులు కాపాడారు. 


మొత్తమ్మీద మహారాష్ట్రలో గడిచిన 48 గంటల్లో దాదా పు 129 మంది వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉత్పాతం ఇంతటితో ముగియలేదని.. వచ్చే 24 గంటల్లో మహారాష్ట్రలోని ఆరు (రాయ్‌గఢ్‌, రత్నగిరి, సింధుదుర్గ, పుణె, సతారా, కొల్హాపూర్‌) జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. కాగా.. రాయ్‌గడ్‌లో జరిగిన విషాదం పట్ల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ప్రధాని మోదీ కూడా మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడినవారికి రూ.50 వేలు ఇవ్వనున్నట్టు తెలిపారు. 


మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేతో మాట్లాడారు. కేంద్రం నుంచి అందించగలిగిన సాయం అంతా అందిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు.. కర్ణాటకనూ భారీ వర్షాలు ముంచెత్తాయి. ఉత్తర కన్నడ జిల్లా దోణిమగుచి ప్రాంతానికి చెందిన బసవన గౌడ(65) అనే వృద్ధుడు పాక కూలి మరణించాడు. యల్లాపుర తాలూకాలోని షిర్లే ఫాల్స్‌ సందనర్శనకు వెళ్లిన ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. పశ్చిమ కనుమల ప్రాంతాలలోని దూద్‌ గంగ, వేద్‌ గంగ, హిరణ్య కేశి నదులకు భారీగా వరద పోటెత్తుతోంది.  

Updated Date - 2021-07-24T07:57:44+05:30 IST