పాక్ విజయంపై సంబరాలు చేస్తే దేశద్రోహం కేసు
ABN , First Publish Date - 2021-10-29T08:24:28+05:30 IST
ఇటీవల జరిగిన టీ-20 వరల్డ్‌కప్ క్రికెట్ మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్థాన్ విజయం సాధించినందుకు సంబరాలు చేసుకునేవారిపై దేశద్రోహం చట్టం ప్రయోగిస్తామని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ గురువారం హెచ్చరించారు.

యూపీ సీఎం హెచ్చరిక.. పలువురి అరెస్ట్
జమ్ములో ప్రభుత్వ ఉద్యోగి తొలగింపు
న్యూఢిల్లీ/లఖ్‌నవూ/నోయిడా/జమ్ము, అక్టోబరు 28: ఇటీవల జరిగిన టీ-20 వరల్డ్‌కప్ క్రికెట్ మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్థాన్ విజయం సాధించినందుకు సంబరాలు చేసుకునేవారిపై దేశద్రోహం చట్టం ప్రయోగిస్తామని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ గురువారం హెచ్చరించారు. భారత క్రికెట్ జట్టుని అసభ్యకర పదజాలంతో విమర్శించిన ఆరోపణలపై పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. జమ్ములో ఒక మహిళా ప్రభుత్వ ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. మ్యాచ్ తరువాత బుదాన్‌కు చెందిన నియాజ్ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో పాక్ జెండా చిత్రంతోపాటు ‘‘ఐ లవ్‌యూ పాకిస్థాన్, ఐ మిస్ యూ పాకిస్థాన్, జీత్ ముబారక్ పాకిస్థాన్’’ అని పోస్టు చేసినట్లు సీనియర్ ఎస్పీ ఓపీ సింగ్ చెప్పారు.
దేశద్రోహం కేసు కింద అతనిని బుధవారం అరెస్టు చేసినట్లు తెలిపారు. కాశ్మీర్‌కు చెందిన ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు ఆగ్రాలో పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేయడంతో పోలీసులు గురువారం వారిని అరెస్టు చేసి, దేశద్రోహం కేసు నమోదు చేశారు. పాకిస్థాన్ విజయాన్ని స్వాగతిస్తూ వాట్సా్‌పలో అభ్యంతరకరమైన స్టేటస్ పెట్టినందుకు జమ్ము డివిజన్ పిర్ పంజాల్ లోయలోని రాజౌరిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ సాఫియా మజీద్‌ను ప్రిన్సిపాల్ డాక్టర్ బ్రిజ్ మోహన్ ఉద్యోగం నుంచి తొలగించారు. పాక్ జట్టు గెలిచినప్పుడు కశ్మీర్ లోయలోని పలు ప్రాంతాల్లో బాణసంచా కాలుస్తూ వేడుకలు జరిపారు. శ్రీనగర్‌లోని రెండు మెడికల్ కాలేజీల్లో వేడుకలు జరిపిన విద్యార్థులపై జమ్ము-కశ్మీర్ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. అయితే, ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు.