కేంద్ర మంత్రి చేతుల్లోంచి కాగితాలు లాక్కున్న.. తృణమూల్‌ సభ్యుడిపై వేటు

ABN , First Publish Date - 2021-07-24T08:08:54+05:30 IST

పెగాసస్‌ వివాదంపై గురువారం ప్రకటన చేస్తున్న ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చేతుల్లోంచి కాగితాలను లాక్కుని చించి వేసిన తృణమూల్‌ ఎంపీ శంతను సేన్‌ను పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసే వరకూ రాజ్యసభ నుంచి సస్పెండ్‌ చేశారు.

కేంద్ర మంత్రి చేతుల్లోంచి కాగితాలు లాక్కున్న.. తృణమూల్‌ సభ్యుడిపై వేటు

వర్షాకాల సమావేశాలు ముగిసే వరకూ సస్పెన్షన్‌

న్యూఢిల్లీ, జూలై 23 (ఆంధ్రజ్యోతి): పెగాసస్‌ వివాదంపై గురువారం ప్రకటన చేస్తున్న ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చేతుల్లోంచి కాగితాలను లాక్కుని చించి వేసిన తృణమూల్‌ ఎంపీ శంతను సేన్‌ను పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసే వరకూ రాజ్యసభ నుంచి సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. దాంతో, సభ నుంచి వెళ్లిపోవాలంటూ ఆయనను తొలుత రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు, ఆ తర్వాత డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ పలుమార్లు విజ్ఞప్తులు చేశారు. అయినా, వాటిని పట్టించుకోకుండా శంతను సేన్‌ సభలోనే ఉండిపోయారు. దాంతో, ప్రతిపక్షాలు, ప్రభుత్వం మధ్య సంఘర్షణ తీవ్రతరమైంది. పెగాసస్‌ స్పైవేర్‌ నిఘా, సాగు చట్టాలు, అధిక ధరలతోపాటు పలు అంశాలపై శుక్రవారం కూడా పార్లమెంట్‌ దద్దరిల్లింది. వరుసగా నాలుగో రోజూ కార్యకలాపాలు ఏమీ జరగకుండానే వాయిదా పడింది. ప్రతిపక్షాలు తీవ్ర గందరగోళం సృష్టించాయి. పెగాసస్‌ అంశంపై చర్చించాల్సిందేనని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌, తృణమూల్‌, డీఎంకే సహా పలు పార్టీలు సభా మధ్యంలోకి దూసుకువచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశాయి. దాంతో, ఉభయ సభలను రెండుసార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. సభలను సజావుగా నడిపేందుకు సహకరించాల్సిందిగా రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా చేసిన విజ్ఞప్తులను ప్రతిపక్ష సభ్యులు ఖాతరు చేయలేదు. పెగాసస్‌ నిఘాపై న్యాయ విచారణ జరిపించాల్సిందేనని పట్టుబట్టాయి. పెగాసస్‌ అంశంపై తమ వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని రాజ్యసభలో కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే పట్టుబట్టారు. మరోవైపు, శిరోమణి అకాలీదళ్‌ సభ్యులు మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. చివరకు ఉభయ సభలు సోమవారం నాటికి వాయిదా పడ్డాయి.


రాజ్యాంగం, పార్లమెంట్‌ పవిత్రతపై గౌరవం లేదా?: వెంకయ్య

సభలో ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటన చేస్తుండగా ఆయన చేతుల్లోంచి కాగితాలను లాక్కొని చించి వేయడాన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై దాడిగా రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు అభివర్ణించారు. రాజ్యసభలో సభ్యుల ప్రవర్తనపై శుక్రవారం ఆయన ప్రకటన చేశారు. మూడు రోజులుగా సభలో జరిగిన సంఘటనలు తనకు తీవ్ర ఆవేదన కలిగించాయని అన్నారు. రాజ్యాంగం నిర్దేశించిన బాఽధ్యతను సభ నెరవేర్చకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదని, ఈ సంక్షోభ సమయంలో సభ తీసుకునే నిర్ణయాల నుంచి ప్రజలకు, దేశానికి ప్రయోజనం కలగకుండా చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ కొవిడ్‌పై మాత్రమే ఫలవంతమైన చర్చ జరిగిందని, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అనేక అంశాలపై చర్చకు ఆస్కారం ఉందని గుర్తు చేశారు. పార్లమెంట్‌ను సజావుగా నడిపించేందుకు ఇప్పటికైనా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జాబితాలో ఉన్నా లేకపోయినా ఏ అంశంపై అయినా సభలో చర్చ చేపట్టే అధికారం రాజ్యసభ చైర్మన్‌గా తనకు ఉందని వెంకయ్య స్పష్టం చేశారు. కాగా, కొంతమంది ప్రతిపక్ష నేతలు వెంకయ్యను ఆయన చాంబర్లో కలిసి మాట్లాడారు.

Updated Date - 2021-07-24T08:08:54+05:30 IST