ఉద్ధవ్ థాకరేకు మహారాష్ట్రను పాలించే అర్హత లేదు : రవిశంకర్ ప్రసాద్
ABN , First Publish Date - 2021-03-21T22:48:11+05:30 IST
మహారాష్ట్రను పరిపాలించే నైతిక అర్హతను ఉద్ధవ్ థాకరే కోల్పోయారని

న్యూఢిల్లీ : మహారాష్ట్రను పరిపాలించే నైతిక అర్హతను ఉద్ధవ్ థాకరే కోల్పోయారని కేంద్ర మంత్రి, బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ అన్నారు. కనీసం ఒక రోజైనా ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక అర్హత ఆయనకు లేదన్నారు.
ముంబై నగర మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు శనివారం ఓ లేఖ రాశారు. మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. అనిల్ తన అధికారిక నివాసానికి పోలీసు అధికారులను గత కొన్ని నెలల్లో అనేకసార్లు పిలిపించుకున్నారని పేర్కొన్నారు. ముంబైలోని బార్లు, రెస్టారెంట్లు, ఇతర సంస్థల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేసి, తనకు ఇవ్వాలని ఆదేశించారని చెప్పారు. ఈ సొమ్మును వసూలు చేసి, తనకు ఇవ్వాలని సస్పెండయిన ఏపీఐ సచిన్ వాజేను అనిల్ ఆదేశించారని తెలిపారు. అయితే హోం మంత్రి, ఎన్‌సీపీ నేత అనిల్ దేశ్‌ముఖ్ స్పందిస్తూ, తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన పరంబీర్ సింగ్‌పై పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ ఆదివారం మాట్లాడుతూ, పరంబీర్ సింగ్ చేసిన ఆరోపణలు తీవ్రమైనవేనని, అయితే ఆయన ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు రాసిన లేఖలో సరైన ఆధారాలేవీ లేవని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, అనిల్ దేశ్‌ముఖ్ రాష్ట్ర హోం మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆదివారం మాట్లాడుతూ, మహారాష్ట్రను కనీసం ఒక రోజు అయినా పరిపాలించే నైతిక అర్హతను ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కోల్పోయారని ఆరోపించారు. మహారాష్ట్ర హోం మంత్రి టార్గెట్ రూ.100 కోట్లు అయితే, మిగిలిన మంత్రుల టార్గెట్ ఎంత? అని ప్రశ్నించారు. ముంబై నగర మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్‌కు వివరాలు ఎందుకు చెప్తున్నారని ప్రశ్నించారు.