శబరిమల సంప్రదాయాలకు రక్షణ : యూడీఎఫ్ ముసాయిదా చట్టం

ABN , First Publish Date - 2021-02-06T20:21:27+05:30 IST

కేరళ శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భక్తుల

శబరిమల సంప్రదాయాలకు రక్షణ : యూడీఎఫ్ ముసాయిదా చట్టం

తిరువనంతపురం : కేరళ శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భక్తుల మనోభావాలను గౌరవిస్తామంటూ యూడీఎఫ్ ప్రజల ముందుకు వస్తోంది. ముసాయిదా శబరిమల బిల్లును విడుదల చేసింది. శబరిమల దేవాలయంలో సంప్రదాయాలను కాపాడతామని, నిబంధనలను ఉల్లంఘించినవారికి జైలు శిక్ష విధిస్తామని పేర్కొంది. ఈ ముసాయిదా బిల్లును కాంగ్రెస్ ఎమ్మెల్యే తిరువాన్‌చూర్ రాధాకృష్ణన్ కొట్టాయంలో శనివారం విడుదల చేశారు. 


తిరువాన్‌చూర్ రాధాకృష్ణన్ మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ రానున్న ఎన్నికల్లో విజయం సాధించి, కేరళలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, శబరిమల దేవాలయం సంప్రదాయాలను కాపాడుతుందన్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఓ చట్టాన్ని ఆమోదిస్తుందన్నారు. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును మాజీ డైరెక్టర్ జనరల్ (ప్రాసిక్యూషన్) అసఫ్ అలీ తయారు చేశారని చెప్పారు. శబరిమల దేవాలయం తంత్రి (ప్రధాన అర్చకుడు) అనుమతితో ఈ దేవాలయంలో ప్రవేశానికి ఆంక్షలు విధిస్తామని ప్రతిపాదించినట్లు తెలిపారు. సంప్రదాయాలను ఉల్లంఘించినవారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. 


శబరిమల దేవాలయంలోకి వయో భేదం లేకుండా మహిళలు ప్రవేశించవచ్చునని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తీసుకున్న చర్యలేమిటో వివరించాలని పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వాన్ని తిరువాన్‌చూర్ రాధాకృష్ణన్ డిమాండ్ చేశారు. తాము రూపొందించిన ముసాయిదా బిల్లు రానున్న ఎన్నికల్లో తురుపు ముక్కగా ఉపయోగపడుతుందని చెప్పారు. శబరిమల సంప్రదాయాలను కాపాడేందుకు చట్టాన్ని ఆమోదించడంలో పినరయి విజయన్ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందన్నారు. సుప్రీంకోర్టు విచారణలో ఉన్నందువల్ల ఈ విషయంలో తామేమీ చేయలేమని ప్రభుత్వం చెప్తోందని, వాస్తవానికి ఈ అంశం ఉమ్మడి జాబితాలో ఉండటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చునని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పును కేవలం చట్టం ద్వారా మాత్రమే అధిగమించవచ్చునని తెలిపారు. 


Updated Date - 2021-02-06T20:21:27+05:30 IST