Chappal Remark: కేంద్రమంత్రి రాణె అరెస్ట్‌తో ఉద్ధవ్‌‌‌పై ఒత్తిడి

ABN , First Publish Date - 2021-08-25T22:49:07+05:30 IST

2018లో జరిగిన ఓ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ మహరాజ్‌ విగ్రహానికి యోగి ఆదిత్యనాథ్, చెప్పులు వేసుకొని పూలదండ వేశారు. అయితే దీనిపై ఉద్ధవ్ థాకరే తీవ్ర స్థాయిలో స్పందించారు

Chappal Remark: కేంద్రమంత్రి రాణె అరెస్ట్‌తో ఉద్ధవ్‌‌‌పై ఒత్తిడి

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను చెప్పుతో కొడతానని అన్నందుకు కేంద్ర మంత్రి నారాయణ రాణె అరెస్టైన విషయం తెలిసిందే. అయితే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చెప్పుతో కొట్టాలని అన్న ఉద్ధవ్ థాకరేను కూడా అరెస్ట్ చేయాలంటూ భారతీయ జనతా పార్టీ నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. మూడేళ్ల క్రితం (అప్పటికి ఉద్ధవ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి కాలేదు) యోగిపై ఉద్ధవ్ చేసిన ఈ వ్యాఖ్యలు కేంద్రమంత్రి రాణె అరెస్ట్‌తో చర్చల్లోకి వచ్చాయి.


2018లో జరిగిన ఓ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ మహరాజ్‌ విగ్రహానికి యోగి ఆదిత్యనాథ్, చెప్పులు వేసుకొని పూలదండ వేశారు. అయితే దీనిపై ఉద్ధవ్ థాకరే తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘‘అతడు ముఖ్యమంత్రిగా ఎలా ఉంటాడు? అతడు యోగి కదా.. అన్ని పరిత్యజించి ఇల్లు వదిలి పెట్టి వెళ్లి గుహలో కూర్చొని ధ్యానం చేసుకోవాలి. కానీ అతడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. పైగా తనను తాను యోగినని చెప్పుకుంటున్నారు. ఈ యోగి గాలి బుడగలాంటి వారు. ఎందుకంటే యోగికి ఉండే లక్షణాలు ఆయనకు లేవు. చెప్పులు వేసుకుని శివాజీకి మాల వేశారు. నాకైతే అదే చెప్పులతో ఆయనను కొట్టాలని అనిపించింది. మహరాజ్ ముందు ఎవరు ఇలా నిల్చున్నా నాకు ఇలాగే అనిపిస్తుంది’’ అని ఉద్ధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


కాగా, దీనికి సంబంధించిన వీడియోను కొంత మంది నెటిజెన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘శివసేన హిపోక్రసీ’ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఉద్ధవ్ థాకరేపై కేసు ఫైల్ చేసి ఆయనను అరెస్ట్ చేయాలని యోగిని డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2021-08-25T22:49:07+05:30 IST