ఇంటింటికీ నాలుగు ఔష‌ధ మొక్క‌ల పంపిణీ!

ABN , First Publish Date - 2021-05-30T15:28:48+05:30 IST

రాజస్థాన్ ప్రభుత్వం ఒక వినూత్న ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్ట‌నుంది.

ఇంటింటికీ  నాలుగు ఔష‌ధ మొక్క‌ల పంపిణీ!

జైపూర్‌: రాజస్థాన్ ప్రభుత్వం ఒక వినూత్న ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. రాష్ట్రంలోని ప్ర‌తీ ఇంటికీ  ఔషధ మొక్క‌ల‌ను పంపిణీ చేయ‌నుంది. ఈ పథకం కింద రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు నాలుగు ఎంపిక చేసిన ఔషధ మూలికా మొక్కలను అందించనున్నారు. గెహ్లాట్ ప్రభుత్వం ఈ మెగా పథకాన్ని రాష్ట్రంలో నివసిస్తున్న మొత్తం 1,26,50,000 కుటుంబాలకు వ‌ర్తింప‌జేయాల‌ని లక్ష్యంగా పెట్టుకుంది. 


ఈ ప‌థ‌కంలో భాగంగా నాలుగు ఔషధ మూలికా మొక్కలైన తులసి, అశ్వగంధ, తిప్ప‌తీగ‌,  నేల‌వేము మొక్క‌ల‌ను ప్ర‌తీ ఇంటికీ అందించ‌నున్నారు. ఈ పంచవర్ష ప్రణాళిక కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 210 కోట్లు మంజూరు చేసింది. ఈ సంద‌ర్భంగా రాజస్థాన్ ప్రభుత్వ అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శి మాట్లాడుతూ రాజస్థాన్ రాష్ట్రంలో జీవవైవిధ్యం సమృద్ధిగా ఉంది. అలాగే అనేక ఔషధ మొక్కలకు నిలయంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేప‌డుతున్న‌ ఘర్ ఘర్ ఔష‌ధీ యోజన ఈ సహజ సంపదను సంరక్షించడంలో సహాయపడుతుంద‌న్నారు. ఔష‌ధ మొక్కల ప్రాధాన్య‌త‌ను ప్ర‌జ‌లు అర్థం చేసుకోవడానికి దోహ‌ద‌ప‌డుతుంద‌న్నారు. 

Updated Date - 2021-05-30T15:28:48+05:30 IST