త్రిపుర మరో ఆఫ్ఘనిస్థాన్ కాకూడదంటే బీజేపీని ఓడించాలి : టీఎంసీ

ABN , First Publish Date - 2021-11-01T01:10:21+05:30 IST

భారతీయ జనతా పార్టీపై ఆలిండియా తృణమూల్

త్రిపుర మరో ఆఫ్ఘనిస్థాన్ కాకూడదంటే బీజేపీని ఓడించాలి : టీఎంసీ

అగర్తల : భారతీయ జనతా పార్టీపై ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ ఆదివారం తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీజేపీని ఓడించాలని, లేనిపక్షంలో త్రిపురలో ఆఫ్ఘనిస్థాన్ తరహా పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరించారు. 2023లో జరిగే శాసన సభ ఎన్నికల్లో గెలిచి, త్రిపురలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, బీజేపీ తప్పుడు పాలనకు తెరదించుతామని అన్నారు. 


ఠాగూర్ సెంటినరీ హాల్ వద్ద జరిగిన సభలో అభిషేక్ మాట్లాడుతూ, త్రిపురలో శాంతిభద్రతల పరిస్థితులు దిగజారాయన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి స్తంభించిందన్నారు. బీజేపీ ఎన్నికల వాగ్దానాలన్నీ బూటకాలని చెప్పారు. మూడున్నరేళ్ళ నుంచి అధికారంలో ఉన్నప్పటికీ ఈ వాగ్దానాలను ఆ పార్టీ నెరవేర్చలేకపోయిందని చెప్పారు. తమది డబుల్ ఇంజిన్ ప్రభుత్వమని బీజేపీ నేతలు చెప్తూ ఉంటారని, పశ్చిమ బెంగాల్, త్రిపుర, కేంద్రం సాధించిన అభివృద్ధిని పరిశీలించినపుడు, త్రిపురలోనూ, జాతీయంగానూ అభివృద్ధేమీ కనిపించడం లేదన్నారు. 


నవంబరు 25న జరిగే అగర్తల పురపాలక సంఘం ఎన్నికల్లో టీఎంసీ పోటీ చేస్తుందన్నారు. 2023లో జరిగే త్రిపుర శాసన సభ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తుందని, బీజేపీని ఓడిస్తుందని అన్నారు. ‘‘మనం పోరాడాలి, బీజేపీని ఓడించాలి. లేనిపక్షంలో త్రిపురలో ఆఫ్ఘనిస్థాన్‌ తరహా పరిస్థితులు వస్తాయి. తాలిబన్ల తరహాలో టీఎంసీ కార్యకర్తలపై దాడులు చేయాలని బీజేపీ నేతలు ఇప్పటికే తమ కార్యకర్తలకు ఆదేశాలు ఇచ్చారు. బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కరోనా వైరస్‌లాంటిది. వారికి మమత అనే ఒకే ఒక డోసు అవసరం’’ అన్నారు. 


రానున్న గోవా శాసన సభ ఎన్నికల్లో టీఎంసీ గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. దొడ్డి దారిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై టీఎంసీకి నమ్మకం లేదని, కావాలనుకుంటే ఇప్పటికిప్పుడు గోవా ప్రభుత్వాన్ని కూల్చగలమని అన్నారు. 15 మంది ఎమ్మెల్యేలు టీఎంసీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రజాస్వామిక పద్ధతిలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.


Updated Date - 2021-11-01T01:10:21+05:30 IST