గాయత్రీ మంత్రంతో కొవిడ్‌కు చికిత్స!
ABN , First Publish Date - 2021-03-21T08:01:06+05:30 IST
కేంద్రం కరోనా చికిత్సలో సరికొత్త పరిశోధనలకు శ్రీకారం చుడుతోంది. ఓ వైపు వ్యాక్సినేషన్ కొనసాగిస్తూనే.. గాయత్రీ మంత్ర జపం, ప్రాణాయామం..

న్యూఢిల్లీ, మార్చి 20: కేంద్రం కరోనా చికిత్సలో సరికొత్త పరిశోధనలకు శ్రీకారం చుడుతోంది. ఓ వైపు వ్యాక్సినేషన్ కొనసాగిస్తూనే.. గాయత్రీ మంత్ర జపం, ప్రాణాయామం.. కరోనా చికిత్సలో ఏ మేరకు ప్రభావం చూపుతాయో తెలుసుకునేందుకు ఓ అధ్యయనం నిర్వహించాలని భావిస్తోంది. రిషికేశ్‌లోని ఎయిమ్స్‌తో కలిసి డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ మేరకు ప్రయత్నాలు మొదలెట్టింది. ఇందుకు 20 మంది కరోనా రోగులను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ‘ఏ’ గ్రూపునకు సాధారణ కరోనా చికిత్స అందిస్తూనే.. వారితో గాయత్రీ మంత్ర పఠనం, రోజుకు గంటపాటు ప్రాణాయామం చేయిస్తారు. ఇదే సమయంలో ‘బీ’ గ్రూపునకు కరోనా చికిత్స మాత్రమే అందిస్తారు. ఈ అధ్యయనం ప్రారంభానికి ముందే.. మొత్తం 20 మందిలోని రోగనిరోధక శక్తి స్థాయిని రిజిస్టర్ చేస్తారు. అనంతరం 14 రోజుల తర్వాత మళ్లీ రెండు గ్రూపుల వారికీ విడివిడిగా రోగనిరోధక శక్తిని పరీక్షించి చికిత్సలో గాయత్రీ మం త్రం, ప్రాణాయామం ప్రభావాన్ని అంచనా వేస్తారు.