వైద్య విద్యలో పారదర్శకత పాటిస్తున్నాం: ప్రధాని
ABN , First Publish Date - 2021-02-26T18:12:37+05:30 IST
వైద్య విద్యలో పారదర్శకత పాటిస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. తమిళనాడులోని

న్యూఢిల్లీ: వైద్య విద్యలో పారదర్శకత పాటిస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. తమిళనాడులోని ఎంజీఆర్ మెడికల్ కాలేజ్ 33వ కాన్వకేషన్ కార్యక్రమంలో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన.. తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 80 శాతం పీజీ సీట్లను, 50శాతం ఎంబీబీఎస్ సీట్లను పెంచామని అన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు గత ఆరేళ్లలో 30వేలకు పైగా ఎంబీబీఎస్ సీట్లు, 24వేల పీజీ సీట్లు పెంచామన్నారు. దేశంలో కొత్తగా 15 ఎయిమ్స్‌లకు అనుమతులు ఇచ్చినట్టు తెలిపారు.
దేశంలో అత్యంత గౌరవనీయమైన వృత్తిలో వైద్యులు ఉన్నారని మోదీ అన్నారు. ఈ కరోనా కాలంలో వారి పట్ల గౌరవం మరింత పెరిగిందన్నారు. వైద్య వృత్తి పట్ల అవగాహన పెరగడంతోనే వైద్యులను గౌరవిస్తున్నారన్నారు. ఎవరికైనా ఇది జీవన్మరణ సమస్యలాంటిదేనన్నారు. గంభీరంగా ఉండటం, సమస్యను తీవ్రంగా పరిగణించడం రెండూ వేరని.. ఈ రెండింటి పట్ల అవగాహనతో వ్యవహరించాలన్నారు. రోగులతో మాట్లాడేటప్పుడు సెన్సాఫ్ హ్యూమర్‌తో వ్యవహరించాలని వైద్యులను ప్రధాని కోరారు. రోగులతో సుహృద్భావంతో వ్యవహరించడానికి ఇది ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు.