టెలికాం ఆపరేటర్లకు ట్రాయ్ ముకుతాడు
ABN , First Publish Date - 2021-09-03T20:41:56+05:30 IST
మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) ఆఫర్ల ద్వారా కస్టమర్ల మధ్య

న్యూఢిల్లీ : మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) ఆఫర్ల ద్వారా కస్టమర్ల మధ్య తారతమ్యం చూపించడం ఆపాలని టెలికాం ఆపరేటర్లను, చానల్ పార్టనర్లను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఆదేశించింది. ఎంఎన్‌పీ ఆఫర్ల ద్వారా వేర్వేరు కస్టమర్లకు వేర్వేరు టారిఫ్‌లను ఆఫర్ చేయడం వివక్షాపూరితమని, దీనిని నిలిపేయాలని తెలిపింది. ఎంఎన్‌పీ ఆఫర్లపై టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఒకదానిపై మరొకటి తనకు ఫిర్యాదు చేస్తున్నాయని పేర్కొంది.
కస్టమర్లు తమ మొబైల్ నెట్‌వర్క్‌ను మార్చుకునేవిధంగా ఆకర్షించడం కోసం ఈ ఆఫర్లను థర్డ్ పార్టీ చానల్ పార్టనర్లు ఇస్తున్నట్లు టెల్కోలు ఆరోపిస్తున్నాయి. దీనికి సర్వీస్ ప్రొవైడర్ల సమ్మతి లేదని చెప్తున్నాయి.
టెలికాం ఆపరేటర్లకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) జారీ చేసిన తాజా ఆదేశాలను ఆ సంస్థ వెబ్‌సైట్‌లో చూడవచ్చు. తనకు తెలియజేయకుండా ఎటువంటి ఆఫర్లను కస్టమర్లకు ఇవ్వజూపవద్దని టెలికాం ఆపరేటర్లను ట్రాయ్ ఆదేశించింది. టారిఫ్ ఆర్డర్లలో పారదర్శకత పెరగడం, అనుచిత వ్యాపార కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం, వివక్ష లేకుండా చూడటం ఈ ఆదేశాల లక్ష్యం. ఈ ఆదేశాల ప్రకారం, ట్రాయ్‌కి సమర్పించిన టారిఫ్‌లను మాత్రమే కస్టమర్లకు ఇవ్వజూపడానికి వీలవుతుంది. టెలికాం ఆపరేటర్ల ఛానల్ పార్టనర్లు, పంపిణీదారులు, రిటెయిలర్లు, థర్డ్ పార్టీ యాప్స్, ఇతరులు ఈ టారిఫ్‌లను మాత్రమే కస్టమర్లకు ఆఫర్ చేయాలి.
అన్ని టారిఫ్ ప్లాన్లు కచ్చితంగా ట్రాయ్ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. ఈ ఆదేశాలకు అనుగుణంగా నడచుకోవలసిన బాధ్యత టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు ఉంది.