కరోనా నుంచి విముక్తి దిశగా..!

ABN , First Publish Date - 2021-08-20T07:33:55+05:30 IST

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తిరోగమనంలో ఆశావహ పరిణామం. వైరస్‌ వ్యాప్తి తీవ్రతను తెలిపే ఆర్‌ వ్యాల్యూ (రి ప్రొడక్షన్‌ రేట్‌) తగ్గుముఖం పట్టింది.

కరోనా నుంచి విముక్తి దిశగా..!

  • దేశంలో 1 దిగువకు ఆర్‌ వ్యాల్యూ
  • కేరళలో మెరుగు.. తమిళనాడు, ఉత్తరాఖండ్‌లోనే ఆందోళన

న్యూఢిల్లీ, ఆగస్టు 19: కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తిరోగమనంలో ఆశావహ పరిణామం. వైరస్‌ వ్యాప్తి తీవ్రతను తెలిపే ఆర్‌ వ్యాల్యూ (రి ప్రొడక్షన్‌ రేట్‌) తగ్గుముఖం పట్టింది. ఈ నెల ప్రారంభంలో 1 దాటి ఆందోళన కలిగించిన ఆర్‌ వ్యాల్యూ.. తాజాగా 0.9 లోపునకు వచ్చింది. ఆగస్టు 14-16 మధ్య ఆర్‌ విలువ 0.89కు పరిమితమైందని చెన్నైకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేథమెటికల్‌ సైన్సెస్‌ ప్రొఫెసర్‌ సితభ్ర సిన్హా వెల్లడించారు. దేశంలో ఆర్‌ విలువపై పరిశోధనకు ఈయన సారథ్యం వహిస్తున్నారు. ఇప్పటికీ 20 వేలపైగా కేసులు నమోదవుతూ, అత్యధిక యాక్టివ్‌ కేసులున్న కేరళలోనూ 1 దిగువకు చేరిందన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో సెకండ్‌ వేవ్‌ ముగింపునకు వచ్చిందని తెలిపారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో మాత్రమే ఆర్‌ విలువ 1 పైగా, తమిళనాడు, ఉత్తరాఖండ్‌లో 1కి దగ్గరగా ఉంది. కరోనా రెండు దశల్లో తీవ్రంగా ప్రభావితమైన మహారాష్ట్ర (0.89)లో వైరస్‌ ప్రభావం తగ్గింది. ఇక పెద్ద నగరాల్లో కోల్‌కతా (1.08), పుణె (1.05)ల్లో మాత్రమే ఆర్‌ వ్యాల్యూ అధికంగా ఉంది. జూలై 7న 0.88కు, అదే నెల ఆఖరుకు 1.03కి పెరిగి కలవరపెట్టింది. అయితే, ఈ నెల 14 నాటికి తగ్గుదల (0.99) నమోదైంది. 


కేరళలో 40 వేల బ్రేక్‌ త్రూ ఇన్ఫెక్షన్లు

టీకా రెండు డోసులు తీసుకున్నవారిలో 87 వేలమందిపైగా కరోనా బారినపడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఇందులో 46 శాతం (40 వేలు) కేసులు కేరళవేనని వివరించాయి. బ్రేక్‌ త్రూ ఇన్ఫెక్షన్లుగా పేర్కొనే ఈ తరహా కేసులు ఆందోళనకారకమని చెప్పాయి.  వందశాతం వ్యాక్సినేషన్‌ జరిగిన వాయనాడ్‌లోనూ బ్రేక్‌ త్రూ ఇన్ఫెక్షన్లు వచ్చినట్లు చెప్పాయి.    

దేశంలో కరోనా పరీక్షల సంఖ్య 50 కోట్లు దాటింది. చివరి 10 కోట్ల టెస్టులను గత 55 రోజుల్లోనే చేశారు.   దేశంలో బుధవారం 36,401 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది.  పాజిటివ్‌ రేటు 1.96 గా ఉంది. కొత్తగా 530 మంది చనిపోగా, అత్యధిక మరణాలు కేరళ (179)లోనే నమోదయ్యాయి. కాగా, కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న గర్భిణిలు, పాలిచ్చే తల్లులలో దుష్ప్రభావా లు పెద్దగా కనిపించలేదని ఓ సర్వే తేల్చింది.

Updated Date - 2021-08-20T07:33:55+05:30 IST