122 మంది చట్టసభల సభ్యులపై ఈడీ కేసులు
ABN , First Publish Date - 2021-08-25T08:06:58+05:30 IST
దేశంలో 122మంది చట్ట సభ్యులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసులు ఉన్నట్లు సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా మంగళవారం సుప్రీంకోర్టుకు ఓ నివేదికను అందజేశారు.

వారిలో 51 మంది ప్రస్తుత/మాజీ ఎంపీలు
మరో 121 మందిపై సీబీఐ కేసుల్లో దర్యాప్తు
తెలంగాణలో 14 కేసుల ఉపసంహరణ
ఉప సంహరణకు ఎలాంటి కారణాలు లేవు
సుప్రీంకోర్టుకు తెలిపిన అమిక్‌సక్యూరీ
మానిటరింగ్ కమిటీ ఏర్పాటుకు సిఫారసు
నేడు జస్టిస్ ఎన్వీ రమణ బెంచ్ విచారణ
న్యూఢిల్లీ, ఆగస్టు 24: దేశంలో 122మంది చట్ట సభ్యులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసులు ఉన్నట్లు సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా మంగళవారం సుప్రీంకోర్టుకు ఓ నివేదికను అందజేశారు. ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులు, వాటి విచారణ తీరు, తదితర అంశాలపై అశ్వినీ ఉపా ధ్యాయ్ అనే న్యాయవాది వేసిన పిల్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్‌ల ధర్మా సనం బుధవారం విచారించనుంది. ఈ కేసులో కోర్టుకు సహాయకుడిగా (అమికస్ క్యూరీ) ఉండాలని సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియాను ధర్మాసనం గతంలో కోరింది. ఆ మేరకు ఆయన దేశవ్యాప్తంగా ప్రజాప్రతి నిధులపై నమోదైన ఈడీ, సీబీఐ కేసుల చిట్టాను న్యాయవాది స్నేహ కాలితా ద్వారా కోర్టుకు సమర్పించారు. ఆ నివేదిక మేరకు 122 మంది ప్రస్తుత/మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈడీ కేసులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత/మాజీ పార్లమెంట్ సభ్యులకు సంబంధించి మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) చట్టం కింద నమోదైన కేసుల్లో 28 దర్యాప్తు దశలో, మరో 10 చార్జిషీటు దశలో ఉన్నాయి. ప్రస్తుత/మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విష యంలో 48 కేసులు దర్యాప్తు దశలో, 15 కేసులు చార్జిషీట్ దశలో ఉన్నట్లు అమికస్‌క్యూరీ కోర్టుకు తెలిపారు. సీబీఐ నమోదు చేసిన 121 కేసుల్లో 51 మంది ప్రస్తుత/మాజీ ఎంపీలు ఉన్నారు. మరో 112 మంది ప్రస్తుత/మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. సీబీఐ పరిధిలోని కేసుల్లో 37 దర్యాప్తు దశలో ఉన్నాయని, వీటిల్లో 17 మంది ప్రస్తుత/మాజీ ఎంపీలు, మరో 17 మంది ప్రస్తుత/మాజీ ఎమ్మెల్యేలు నిందితులుగా ఉన్నట్లు విజయ్ హన్సారియా తన నివేదికలో పేర్కొన్నారు. ఐదుగురు ఎంపీలు, తొమ్మిది మంది ఎమ్మెల్యేలు తమ కేసుల దర్యాప్తు దశలో చనిపోయారని వివరించారు.
వేగవంతమైన దర్యాప్తునకు సిఫారసులివే..
ప్రజాప్రతినిధులపై నమోదైన ఈడీ, సీబీఐ కేసుల్లో వేగవంతమైన దర్యాప్తునకు అమికస్ క్యూరీ తన నివేదికలో పలు సూచనలు చేశారు.
విచారణ, దర్యాప్తు పురోగతిని రోజువారీగా పరిశీలించాలి. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి, ట్రయల్ కోర్టు విచారణకు ఆటంకం లేకుండా పురోగతిని హైకోర్టులు పరిశీలించాలి.
దర్యాప్తునకు సహకరించని నిందితుల బెయిల్ రద్దు చేయాలి
వేగవంతమైన దర్యాప్తు, విచారణకు ‘మానిటరింగ్ కమిటీ’ని ఏర్పాటు చేయాలి. అందులో సుప్రీంకోర్టు మాజీ జడ్జి లేదా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, ఈడీ డైరెక్టర్(లేదా ఆయన సూచించే అధికారి), సీబీఐ డైరెక్టర్ (లేదా ఆయన సూచించే అధికారి), కేంద్ర హోంశాఖ కార్యదర్శి(లేదా ఆయన సూచించే అధికారి), జిల్లా జడ్జి పైర్యాంకులో ఉన్న న్యాయాధికారి ఉండాలి.
మానిటరింగ్ కమిటీని సుప్రీంకోర్టు రెండు వారాల్లో ఏర్పాటు చేయాలి. ఆ కమిటీ తన స్టేటస్ రిపోర్టును 2 నెలల్లో సీల్డ్‌కవర్‌లో అందజేయాలి
ఆ కేసుల రద్దుకు కారణాలు చెప్పలేదు
2013లో ముజఫరాబాద్ అల్లర్లకు సంబంధించి 510 కేసులు నమోద వ్వగా.. 175 కేసుల్లో చార్జిషీట్లు దాఖలయ్యాయి. 165 కేసుల్లో తుది నివేదికలు అందాయి. 170 కేసులను కొట్టివేశారు. ఆ తర్వాత 77 కేసులను ఉత్తరప్రదేశ్ సర్కారు ఉపసంహరించుకుంది. అందుకు స్పష్టమైన కారణాలు చెప్పలేదు.
అలాగే కర్ణాటక సర్కారు 62 కేసులను, కేరళ ప్రభుత్వం 36, తెలంగాణ 14, తమిళనాడు 4 కేసులను ఉపసంహరించుకున్నాయి