అవినీతిని సహించం
ABN , First Publish Date - 2021-10-21T08:03:43+05:30 IST
ప్రతి ఒక్కరికీ న్యాయం లభించినప్పుడే దేశంలో సుపరిపాలన సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు....
పేదలను దోచుకొనే వారిని క్షమించం
సీబీఐ, సీవీసీ సమావేశంలో మోదీ
న్యూఢిల్లీ, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరికీ న్యాయం లభించినప్పుడే దేశంలో సుపరిపాలన సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అవినీతి ఎంత చిన్నస్థాయిలో ఉన్నా సహించబోమని, అది దేశ ప్రగతిని దెబ్బతీయడంతో పాటు ప్రజల హక్కులను సైతం కాలరాస్తుందన్నారు. గుజరాత్‌లోని కెవాడియాలో బుధవారం నిర్వహించిన సీబీఐ, సీవీసీ అధికారుల సంయుక్త సదస్సులో మోదీ వర్చువల్ విధానంలో ప్రసంగించారు.
దేశంలో అవినీతి అణచివేత సాధ్యమవుతుందనే విశ్వాసం ప్రజల్లో కలిగించేలా గత ఆరేడు సంవత్సరాల్లో చర్యలు తీసుకున్నామని చెప్పారు. మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా తమకు ప్రభుత్వ పథకాలు లభిస్తాయన్న నమ్మకం ప్రజలకు కలిగిందన్నారు. దేశాన్ని మోసం చేసినవారు, పేదలను దోపిడీ చేసేవారు ఎంత శక్తిమంతులైనా, వారు దేశంలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా ఈ ప్రభుత్వం వారిని క్షమించబోదని ప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పారు. అవినీతి వ్యవస్థలో భాగమని అంగీకరించేందుకు అధునాతన భారతం సిద్ధంగా లేదన్నారు. పారదర్శక వ్యవస్థ, సమర్థమైన నిర్ణయాలు, సాఫీగా పాలనను ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ప్రజలకు సాధికారికత కల్పించడం ద్వారా వారి విశ్వాసం చూరగొనాలని, అనవసరమైన వేధింపులకు గురిచేయకూడదని అధికారులకు సూచించారు. ఆన్‌లైన్ ద్వారా ముఖాలు చూడకుండానే గ్రూప్-సి, గ్రూప్-డి నియామకాలకు ఇంటర్వ్యూలు జరిగిన విషయాన్ని మోదీ గుర్తుచేశారు. గ్యాస్ సిలిండర్ల బుకింగ్ నుంచి పన్ను చెల్లింపుల ప్రక్రియ వరకూ క్యూలలో నిలబడాల్సిన అవసరం లేకుండా ప్రజలకు విముక్తి కలిగించామన్నారు.
కాలం చెల్లిన అనేక చట్టాలను నిర్మూలించి ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా కొత్త చట్టాలు చేశామన్నారు. డిజిటల్ ఫుట్ ప్రింట్ల ద్వారా దర్యాప్తులు సులభతరం అయ్యాయన్నారు. ఇటీవల ప్రారంభించిన పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్‌ప్లాన్ నిర్ణయాలు తీసుకునే క్రమాన్ని వేగవంతం చేసిందన్నారు. అవినీతిని సమూలంగా నిరోధించడమే లక్ష్యంగా పనిచేయాలని, సైబర్ నేరాలు, మోసాల నుంచి ప్రజలను కాపాడే మార్గాలను అన్వేషించాలని అధికారులకు ప్రధాని సూచించారు.