కుదేలైన ఆర్థిక వ్యవస్థకు.. బడ్జెట్ వ్యాక్సిన్!
ABN , First Publish Date - 2021-02-01T06:42:10+05:30 IST
కొవిడ్ దెబ్బకు దాదాపు 24% మేర కుచించుకుపోయిన ఆర్థిక వ్యవస్థ ఇంకా నెగెటివ్ వృద్ధి కోరల్లోంచి రాలేదు! అసలే నిరుద్యోగ సమస్య.. ఆపై కొవిడ్ దెబ్బకు ఉన్న ఉద్యోగాలు పోయాయి. ప్రజల ఖర్చు తగ్గింది. మిగిలిన వారూ ఆచితూచి ఖర్చు పెడుతున్న పరిస్థితి. ప్రజల వ్యయం తగ్గిపోవడంతో

నేడే కేంద్ర బడ్జెట్
11 గంటలకు ప్రవేశపెట్టనున్న నిర్మల
ఆర్థిక మంత్రి సరైన టీకా వేస్తారా?.. ఆరోగ్యానికి భారీ కేటాయింపు!
ఆదాయపన్ను పరిమితి పెంపుపై వేతనజీవుల ఆశ
గరిష్ఠ పన్ను శ్లాబులో ఉన్నవారిపై కొవిడ్-19 సెస్
రైతులకు ఇచ్చే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పెంపు!
ఉద్యోగాల కల్పన, మౌలిక సదుపాయాలపై దృష్టి
ఈ బడ్జెట్ దార్శనిక పత్రంలా ఉండాలని సూచన
జీఎస్టీ వసూళ్లు రూ.1.20 లక్షల కోట్లు
జనవరిలోనూ ఆల్‌టైం రికార్డు స్థాయికి
కొవిడ్ దెబ్బకు దాదాపు 24% మేర కుచించుకుపోయిన ఆర్థిక వ్యవస్థ ఇంకా నెగెటివ్ వృద్ధి కోరల్లోంచి రాలేదు! అసలే నిరుద్యోగ సమస్య.. ఆపై కొవిడ్ దెబ్బకు ఉన్న ఉద్యోగాలు పోయాయి. ప్రజల ఖర్చు తగ్గింది. మిగిలిన వారూ ఆచితూచి ఖర్చు పెడుతున్న పరిస్థితి. ప్రజల వ్యయం తగ్గిపోవడంతో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. మరిన్ని ఉద్యోగాలు పోయే పరిస్థితి. ఇదో విషవలయంగా తయారైంది. పలు రాష్ట్రాల ఆర్థిక స్థితీ అంతంతమాత్రమే. మరోవైపు సరిహద్దుల్లో చైనాతో ఘర్షణ వాతావరణం నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో రక్షణ రంగంపై ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఇంతటి క్లిష్టపరిస్థితుల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల నేటి బడ్జెట్‌లో సరైన వ్యాక్సిన్ వేస్తారా? వచ్చే ఏడాది రెండంకెల వృద్ధిరేటును అందుకోవాలన్న లక్ష్యాన్ని సాధిస్తూనే.. ప్రజలపై పన్ను భారాలు మోపకుండా ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతారా? ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో ఎన్నికలున్న నేపథ్యంలో తాయిలాల వైపే మొగ్గు చూపుతారా?
న్యూఢిల్లీ, జనవరి 31: కరోనా మహమ్మారి దెబ్బకు కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ, తగ్గిన ఆదాయం, పెరిగిన వ్యయం.. దెబ్బతిన్న వ్యాపారాలు, జీవితాలు.. భారీగా పెరిగిన నిరుద్యోగ సమస్య.. ఇన్ని సవాళ్ల నడుమ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి పన్నులు పెంచేస్తారా? లేక.. ఇప్పటికే కరోనా తాకిడికి కుదేలైన ప్రజలకు ఇబ్బంది లేకుండా పన్ను స్థిరత్వాన్ని కొనసాగిస్తూ, మౌలిక సదుపాయాలపై వ్యయాన్ని పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరిస్తారా? ఆదాయపన్ను శ్లాబుల్లో పైస్థాయిలో ఉన్నవారిపై ఈసారి అదనంగా కొవిడ్-19 సుంకం విధించే అవకాశం ఉందని.. ఆదాయపన్నులో భారీగా రాయితీలు ఇవ్వబోతున్నారని.. ఇలా ఈ బడ్జెట్‌పై ఎన్నెన్నో ఊహాగానాలు.
అవి ఎంతవరకూ నిజమో.. కేంద్రం ఏ బాటలో పయనించనుందో చూడాలి. ఆర్థిక నిపుణులు మాత్రం.. ఉద్యోగకల్పనపై ఎక్కువగా ఖర్చు పెట్టడం, గ్రామీణాభివృద్ధి, అభివృద్ధి పథకాలకు భారీగా కేటాయింపులు, విదేశీ పెట్టుబడులు ఎక్కువగా వచ్చే లా నిబంధనల సడలింపు వంటివాటిపై మోదీ సర్కా రు ఈ బడ్జెట్‌లో దృష్టిసారిస్తుందని అంచ నా వేస్తున్నారు. అంతేకాదు.. పన్ను చెల్లింపుదారుల చేతుల్లో డబ్బు ఎక్కువగా ఉండే విధానాలను అనుసరిస్తుందని భావిస్తున్నారు. ఈ బడ్జెట్ కేవలం రూపాయి రాకపోకలను లెక్కించే పద్దులా కాకుండా.. కరోనా తాకిడికి పట్టాలు తప్పిన ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించే దార్శనిక పత్రం కావాలని వారు ఆకాంక్షిస్తున్నారు.
ఏమేం ఉండొచ్చు?
బడ్జెట్ అనగానే వేతనజీవులందరి ఆలోచన ఆదాయపన్ను మీదకే మళ్లుతుంది. ఆదాయపన్ను పరిమితిని పెంచాలని ప్రజలు కోరుతుంటారు. కానీ ప్రభుత్వాలు మాత్రం మెజారిటీ సందర్భాల్లో వారి విజ్ఞప్తిని పట్టించుకోవు. అందునా కొవిడ్ వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న ప్రస్తుత నేపథ్యంలో ఈసారి ఆదాయపన్ను పరిమితి పెంపు ఉండకపోవచ్చని కొందరు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, స్టాండర్డ్ డిడక్షన్ మొత్తాన్ని మాత్రం పెంచే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. గృహరుణ వడ్డీలపై పన్ను రాయితీ మొత్తాన్ని పెంచే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అలాగే, టీకా కార్యక్రమానికి ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో ఎంత కేటాయించబోతోందనే అంశంపైనా అందరూ ఆసక్తి చూపుతున్నారు. కేవలం వ్యాక్సినేషన్‌కే కాక.. మొత్తంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను పటిష్ఠం చేయడానికి భారీగానే కేటాయింపులు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక.. కరోనా కారణంగా ఆదాయం బాగా తగ్గిన నేపథ్యంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఎయిరిండియా, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటివాటిని ప్రైవేటుపరం చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
మౌలిక సదుపాయాల వ్యయాన్ని భారీగా పెంచడం ద్వారా ప్రజల చేతుల్లోకి పెద్ద ఎత్తున డబ్బు చేరేలా చేసేందుకు.. ‘నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్’ కార్యక్రమానికి ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉందని సమాచారం. రియల్ ఎస్టేట్ రంగానికి, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు బడ్జెట్‌లో ప్రాధాన్యమివ్వనున్నట్టు సమాచారం. అందరికీ నిరంతర విద్యుత్తు సరఫరా సాధనకుగాను.. డిస్కమ్‌లకు ఊపిరిపోసేలా ఈ బడ్జెట్‌లో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టే అంశంపై చర్చలు జరుగుతున్నట్టు ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక.. కొత్త వ్యవసాయ చట్టాలపై ఆగ్రహంగా ఉన్న రైతులను శాంతింపజేసేందుకు ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ పేరిట ఇస్తున్న మొత్తాన్ని పెంచే అవకాశం ఉందని అంచనా.
ఆరోగ్య రంగానికి ప్రాధాన్యం
బడ్జెట్‌లో ఈసారి ఆరోగ్య సంరక్షణ రంగానికి ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని అసోచాం ప్రైమస్ పార్ట్‌నర్స్ సర్వేలో అత్యధికులు అభిప్రాపడ్డారు. సర్వేలో పాల్గొన్నవారిలో 39.7ు మంది.. బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి నిధుల కేటాయింపులోగానీ, విధానపరమైన మద్దతులోగానీ ఎక్కువ ప్రాధా న్యం దక్కుతుందని అభిప్రాయపడ్డారు. ఉత్పత్తి రంగానికి రెండో ప్రాధాన్యం దక్కుతుందని 14.7ు మంది అభిప్రాయపడగా.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు దక్కుతుందని 11.4ు మంది అభిప్రాయపడ్డారు.
బ్రీఫ్‌కేసు.. సంచి.. ఈ-బడ్జెట్!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్న మూడో బడ్జెట్ ఇది. 2019లో ఆమె ఆర్థిక మంత్రిగా తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఆనవాయితీ ప్రకారం ఆమె ఆ ఏడాది బడ్జెట్ పత్రాలను లెదర్ బ్రీఫ్‌కేసులో పట్టుకొచ్చారు. 2020లో భారతీయ సంప్రదాయ పద్ధతిలో ‘వహి-ఖాతా’ పేరుతో ఎర్రటివస్త్రంలో చుట్టి తీసుకొచ్చారు. ముచ్చటగా మూడో ఏడాది.. ఈసారి కరోనా నేపథ్యంలో కాగితాలపై కాకుండా డిజిటల్ పద్ధతిలో ఈ-బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఎంపీలకు, సాధారణ ప్రజలకు.. అందరికీ బడ్జెట్ పత్రాలను యాప్ ద్వారా అందుబాటులోకి తేనున్నారు.
