డీఎంకే ఖాతాలోనే 3 రాజ్యసభ సీట్లు
ABN , First Publish Date - 2021-06-06T11:20:48+05:30 IST
రాజ్యసభ సభ్యులుగా ఉన్న కేపీ మునుస్వామి, వైద్యలింగంలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. దీంతో తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. అదేసమయంలో రాణిపే
- అభ్యర్థులు వీరేనా?
అడయార్(చెన్నై): రాజ్యసభ సభ్యులుగా ఉన్న కేపీ మునుస్వామి, వైద్యలింగంలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. దీంతో తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. అదేసమయంలో రాణిపేటకు చెందిన మహ్మద్ జాన్ అన్నాడీఎంకే తరపున రాజ్యసభ సభ్యుడుగా ఉన్నారు. ఈయన అకాలమరణం చెందడంతో ప్రస్తుతం రాష్ట్రం వాటాలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ మూడు స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరిగే సూచనలు ఉన్నాయి. ఈ మూడు స్థానాలు ఇప్పుడు డీఎంకేకు వెళ్ళనున్నాయి. దీనికి కారణం ప్రస్తుతం అసెంబ్లీలో డీఎంకే కూటమి బలం 159గా ఉంది. అందువల్ల డీఎంకే తరపున పోటీకి దింపే అభ్యర్థులు సులభంగా విజయం సాధించనున్నారు. మరోవైపు డీఎంకే తరపున పోటీ చేసే అభ్యర్థులు వీరేనంటూ ముగ్గురి పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో సుబ్బులక్ష్మి జగదీశన్, కార్తికేయ శివసేనాధిపతి, తంగ తమిళ్‌సెల్వన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇదిలావుంటే, 2016లో రాజ్యసభకు ఎన్నికైన వైద్యలింగం పదవీకాలం 2022లోను, 2019లో ఎన్నికైన మహ్మద్ జాన్ పదవీకాలం 2025లోను, 2020లో ఎన్నికైన కేపీ మునుస్వామి పదవీకాలం 2026లో ముగియనుంది.