మళ్లీ మూడు సాగు చట్టాలు?

ABN , First Publish Date - 2021-12-26T06:57:01+05:30 IST

: దాదాపు ఏడాదికి పైగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేయడంతో ఉపసంహరించుకున్న సాగు చట్టాలను మరో రూపంలో కేంద్రం ప్రవేశపెట్టనుందా....

మళ్లీ మూడు సాగు చట్టాలు?

కేంద్రం మరో రూపంలో ప్రవేశపెట్టే అవకాశం

యూపీ, పంజాబ్‌లో బీజేపీకి పెరగని ప్రజాదరణ

అందుకే వ్యూహం మార్చిన ప్రధాని మోదీ

మళ్లీ పెడతామని మంత్రి తోమర్‌తో సంకేతాలు

ప్రధాని ఉపసంహరిస్తారు.. కేంద్ర మంత్రి ప్రతిపాదిస్తారు 

తోమర్‌ వ్యాఖ్యలపై కేటీఆర్‌


న్యూఢిల్లీ, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): దాదాపు ఏడాదికి పైగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేయడంతో ఉపసంహరించుకున్న సాగు చట్టాలను మరో రూపంలో కేంద్రం ప్రవేశపెట్టనుందా? కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ నాగపూర్‌లో శుక్రవారం  చేసిన ప్రకటనతో ఈ అనుమానాలు ప్రారంభమయ్యాయి. వ్యవసాయ చట్టాలను భవిష్యత్తులో ఎప్పుడైనా తిరిగి ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆయన అన్నారు. శుక్రవారం నాగపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. నల్ల చట్టాలని విపక్షాలు అభివర్ణించిన ఈ చట్టాలే అదే రూపంలో భవిష్యత్తులో తిరిగి అమల్లోకి వస్తాయని జోస్యం చెప్పారు. తాము కేవలం ఒక అడుగు వెనక్కి వేశామని ఆయన అన్నారు. వ్యవసాయ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు అవసరమని పేర్కొన్నారు. యూపీ, పంజాబ్‌ ఎన్నికల ముందు మంత్రి వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. గత నెలలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. చట్టాల విషయంలో ఆయన ఒక్కసారిగా మడమ తిప్పడం ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ ఎన్నికల భయంతోనేనని విపక్షాలు, రాజకీయ విశ్లేషకులు తేల్చారు. అందుకు తగ్గట్టుగా ఢిల్లీలో ధర్నా చేసిన రైతుల్లో అధికులు ఈ రెండు రాష్ట్రాల వారే కావడం గమనార్హం. ప్రభుత్వం వెనక్కి తగ్గడంతో రైతులు ఉద్యమాన్ని ఉపసంహరించుకున్నారు. ఇంతలో మళ్లీ మూడు చట్టాలను తెస్తామని మంత్రి తెగేసి చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరచింది. 


పొందే లాభం లేదనే?

సాగు చట్టాలను ఉపసంహరించుకోవడం వల్ల ప్రభుత్వానికి కానీ, బీజేపీకి కానీ ఎలాంటి రాజకీయ ప్రయోజనం లభించదనే సమాచారం రావడంతో మోదీ సర్కారు వాటిని మరో రూపంలో తిరిగి ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. వాటిని ఉపసంహరించుకున్న తర్వాత కూడా యూపీ, పంజాబ్‌లలో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. దృఢమైన నాయకుడిగా ప్రధాని మోదీకి ఉన్న ప్రతిష్ఠ వ్యవసాయ చట్టాల ఉపసంహరణతో సన్నగిల్లిందని, పారిశ్రామిక వేత్తలు కూడా ఈ వెనుకడుగుతో అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. దీంతో.. మోదీ సర్కారు మళ్లీ చట్టాలను తెచ్చేందుకు సిద్ధమవుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన ప్రతిష్ఠను పునరుద్ధరించుకొనేందుకే మోదీ తోమర్‌ను ప్రయోగించారని భావిస్తున్నారు. వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో సాగు చట్టాలు మరో రూపంలో వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాగా.. యూపీ, పంజాబ్‌ ఎన్నికల తర్వాత చట్టాలను తిరిగి అమలు చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఎన్నికల్లో ఓడించడం ద్వారా బీజేపీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

Updated Date - 2021-12-26T06:57:01+05:30 IST