ఇది ‘2024’ కేబినెట్‌ !

ABN , First Publish Date - 2021-07-08T07:48:51+05:30 IST

వ్యక్తులకు ప్రాధాన్యం కల్పించడం, సీనియర్లు కదా అని గౌరవించడం, ఎవరో ఏదో అనుకుంటారని మొహమాటాలకు పోయి వారిని దగ్గరకు చేర్చుకోవడం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాల తత్వం కాదు.

ఇది ‘2024’ కేబినెట్‌ !

  • ఎన్నికలే లక్ష్యంగా కూర్పు!
  • సీనియర్లన్న మొహమాటం లేదు
  • వ్యక్తులకు ప్రాధాన్యమే ఉండదు
  • సామాజిక సమీకరణలే మంత్రం
  • యువతను ఆకర్షించడమే తంత్రం
  • అంతిమంగా విజయాలే టార్గెట్‌
  • ఇదే మోదీ-షా తత్వం
  • కొత్త మంత్రివర్గంపై రాజకీయ వర్గాలు


(న్యూఢిల్లీ-ఆంధ్రజ్యోతి): వ్యక్తులకు ప్రాధాన్యం కల్పించడం, సీనియర్లు కదా అని గౌరవించడం, ఎవరో ఏదో అనుకుంటారని మొహమాటాలకు పోయి వారిని దగ్గరకు చేర్చుకోవడం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాల తత్వం కాదు. ఎన్నికల్లో విజయం సాధించడం, దేశవ్యాప్తంగానూ, వివిధ సామాజిక వర్గాల్లోనూ పార్టీని విస్తరింపజేయడం  ఒక్కటే వారి లక్ష్యమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన రెండేళ్ల తర్వాత మోదీ మొదటిసారి చేసిన కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ.. 2024 లోక్‌సభ ఎన్నికలే టార్గెట్‌గా చేపట్టిందేనని అంటున్నాయి. ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌తో పాటు వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం తాజా కూర్పు తక్షణ కర్తవ్యమని పేర్కొంటున్నాయి. కొత్త జట్టుతో సమర్థంగా పనిచేయించి యువతరాన్ని ఆకర్షించి విజయాలు సాధించడమే మోదీ-షా తంత్రమని చెబుతున్నాయి. నూతన కేబినెట్‌లో యువతకు, మహిళలకు పెద్ద పీట వేయడం ఉద్దేశం ఆయా వర్గాలను ఆకర్షించడమేనంటున్నాయి. కొత్తగా ఏడుగురు మహిళలు మంత్రులను తీసుకోవడంతో.. కేబినెట్‌ మంత్రులు నిర్మలా సీతారామన్‌, స్మృతి ఇరానీతో కలిపి మంత్రివర్గంలో మహిళల సంఖ్య 11కు పెరిగింది. 


అలాగే కీలకమైన వెనుకబడిన తరగతులు, ఎస్సీల్లో పట్టు పెట్టుకునే దిశగా మంత్రి పదవులు కట్టబెట్టారు. మోదీ కొత్త కేబినెట్‌లో రికార్డు స్థాయిలో 12 మంది ఎస్సీ మంత్రులు ఉండగా... ఓబీసీలు 27 మంది, ఎస్టీలు 8 మంది ఉండడం గమనార్హం. మైనారిటీల్లోనూ ఒక్కో ముస్లిం, సిక్కు, క్రైస్తవుడు, ఇద్దరు బౌద్ధులకు స్థానం కల్పించారు. మంత్రుల్లో అతి చిన్నవాడు నిశిత్‌ ప్రామాణిక్‌ (35) కాగా.. పంజాబ్‌కు చెందిన సోం ప్రకాశ్‌ (72) అందరికంటే పెద్దవారు. తద్వారా పార్టీలో, ప్రభుత్వంలో తరం మార్పు సంకేతాలు ఇచ్చినట్లయిందని అంటున్నారు. సీనియర్‌ మంత్రులు, బీజేపీలో కీలక నేతలైన రవిశంకర్‌ ప్రసాద్‌, ప్రకాశ్‌ జావడేకర్‌, సంతోష్కుమార్‌ గాంగ్వార్‌, సదానందగౌడలను నిర్మొహమాటంగా మోదీ తొలగించేశారు. వీరు గతంలో వాజపేయి కేబినెట్‌లో కూడా పనిచేశారు. సమర్థులన్న పేరూ ఉంది. అయినా పార్టీ ప్రయోజనాలే మిన్నంటూ వారిని తప్పించారు. వాజపేయి మంత్రివర్గంలో పనిచేసి మోదీ కేబినెట్‌లో ప్రస్తుతం కొనసాగుతోంది రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఒక్కరే కావడం విశేషం. 

Updated Date - 2021-07-08T07:48:51+05:30 IST