Nirmala Sitharaman కీలక ప్రకటనతో Tamil Nadu లోని ఇవన్నీ ప్రైవేట్ పరం..!

ABN , First Publish Date - 2021-08-25T16:28:40+05:30 IST

ఆరులక్షల కోట్ల నిధుల సమీకరణకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన..

Nirmala Sitharaman కీలక ప్రకటనతో Tamil Nadu లోని ఇవన్నీ ప్రైవేట్ పరం..!

  • లీజుకు చెన్నై సెంట్రల్‌, తూత్తుకుడి రేవు 
  • ఆరు విమానాశ్రయాలు, ఎన్నెల్సీ, ఊటీ కొండరైలు


చెన్నై : ఆరులక్షల కోట్ల నిధుల సమీకరణకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన కీలక ప్రకటన మేరకు రాష్ట్రంలో సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌, తూత్తుకుడి ఓడరేవు, ఆరు విమానాశ్రయాలు, ఎన్నెల్సీ, ఊటీ కొండరైలు ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇవ్వనున్నారు. నిధుల సేకరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆస్తులు, సేవలు, పథకాలను ప్రైవేటు సంస్థలకు లీజుకివ్వనున్నట్లు నిర్మలా సీతారామన్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంస్థల వివరాలను కేంద్ర ప్రభుత్వం సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. నైవేలిలోని ఎన్సెల్సీ సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం, కావేరి నదీ పరీవాహక ప్రాంతాల్లోని సహజ ఇంధన వాయువులు, తూత్తుకుడి ఓడరేవును ప్రైవేటు వ్యక్తులు లేదా సంస్థలకు లీజుకు ఇవ్వనున్నారు. ఇదేవిధంగా పుదుచ్చేరిలోని రైల్వేస్టేషన్‌, హోటల్‌ అశోక్‌ను లీజుకు ఇవ్వనున్నారు. ఇక రాష్ట్రంలోని ఆరు విమానాశ్రయాలను కూడా వరుసగా ప్రైవేటు సంస్థల ఆధీనంలోకి వెళ్ళనున్నాయి. తొలుత తిరుచ్చి విమానాశ్రయాన్ని లీజుకు ఇస్తారు. ఆ తర్వాత వరుసగా మదురై, కోయంబత్తూరు, చెన్నై విమానాశ్రయాలను ప్రైవేటు సంస్థలు లీజుకు తీసుకుంటాయి.


రహదారులు కూడా....

ఇదే విధంగా రాష్ట్రంలో జాతీయ ప్రధాన రహదారుల నిర్వహణ బాధ్యత కూడా ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఆ మేరకు చెన్నై - తిరుచ్చి జాతీయ రహదారి, కృష్ణగిరి - తోప్పూరు, కృష్ణగిరి - హోసూరు, తిరుచ్చి - కారైక్కుడి, తిరుచ్చి బైపాస్‌ రోడ్డును లీజుకు ఇవ్వనున్నారు. ఇక భారత వారసత్వ సంపదగా పరిగణించే నీలగిరి కొండ రైలు (ఊటీ హిల్‌ ట్రైన్‌)ను కూడా ప్రైవేటు సంస్థలకు లీజుకివ్వడం ఖాయమని తెలిసింది. ఊటీ కొండ రైలు సంస్థకు సంబంధించి పలు ఎస్టేట్‌ భూములు కూడా ఉన్నాయి. ఇవన్నీ త్వరలోనే ప్రైవేటు సంస్థల ఆధీనంలోకి వెళ్ళనున్నాయి.

Updated Date - 2021-08-25T16:28:40+05:30 IST