మమత సారథ్యంలో మూడో ఫ్రంట్‌!

ABN , First Publish Date - 2021-06-22T07:08:08+05:30 IST

జాతీయ స్థాయిలో మూడో ఫ్రంట్‌ ఏర్పాటుకు సన్నాహాలు వేగవంతమవుతున్నాయి. పశ్చిమబెంగాల్‌

మమత సారథ్యంలో మూడో ఫ్రంట్‌!

  • పార్టీలను ఏకం చేసే పనిలో శరద్‌ పవార్‌
  • నేడు వివిధ పార్టీల నేతలతో కీలక సమావేశం
  • హాజరు కావాల్సిందిగా 15 పార్టీలకు ఆహ్వానం
  • మరోసారి పవార్‌తో ప్రశాంత్‌ కిశోర్‌ మంతనాలు


 

న్యూఢిల్లీ, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయిలో మూడో ఫ్రంట్‌ ఏర్పాటుకు సన్నాహాలు వేగవంతమవుతున్నాయి. పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సారథ్యంలో దీనిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వివిధ పార్టీల నేతలను ఏకం చేసే బాధ్యతను ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ తీసుకున్నారు. మంగళవారంతన నివాసంలో ఆయా పార్టీల నేతలతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి రావాల్సిందిగా దాదాపు 15 పార్టీల నేతలను, మేధావులు, కళాకారులను పవార్‌ ఆహ్వానించారు.
కొద్ది రోజుల క్రితం ముంబైలో శరద్‌ పవార్‌ను కలిసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ సోమవారం ఢిల్లీలో మరోసారి ఆయనతో భేటీ అయి చర్చలు జరిపారు. అనంతరం పవార్‌ తన కార్యాచరణ ముమ్మరం చేశారు. మంగళవారం జరిగేది ప్రాథమిక సమావేశమేనని, ఇందులో భవిష్యత్తు కార్యాచరణకు తగిన రూపకల్పన జరుగుతుందని ఎన్సీపీ నేత ఒకరు చెప్పారు. 2024 నాటికి మూడో ఫ్రంట్‌ను సిద్దం చేయడమే ప్రధాన లక్ష్యంగా సాగుతున్న ఈ సమావేశంలో ప్రస్తుత దేశ రాజకీయ, ఆర్థిక పరిస్థితులను ప్రధానంగా చర్చిస్తారని ఆయన పేర్కొన్నారు.


ఈ సమావేశంలో సంజయ్‌సింగ్‌, పవన్‌ వర్మతో పాటు ఎన్సీపీ ఎంపీ వందనా చవాన్‌, జమ్ము కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా, సీపీఐ నేత డి.రాజా, సమాజ్‌వాది పార్టీ నేత ఘన్‌శ్యామ్‌ తివారీ, ఆర్‌ఎల్‌డీ అధ్యక్షుడు జయంత్‌ చౌదరి తదితరులు పాల్గొననున్నారు. వీరితోపాటు మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఎస్‌ వై ఖురేషి, ప్రముఖ కవి జావెద్‌ అఖ్తర్‌, మాజీ న్యాయమూర్తి ఏపీ సింగ్‌, ఇరాన్‌ మాజీ రాయబారి కేసీ సింగ్‌, జర్నలిస్టులు కరణ్‌ థాపర్‌, అశుతోష్‌, ప్రీతిష్‌ నంది,  కాంగ్రెస్‌ మాజీ అధికార ప్రతినిధి సంజయ్‌ ఝా, కాలమిస్టు సుదీంధ్ర కులకర్ణి తదితరులు పాల్గొంటారు. 
హైకోర్టులో మమతకు చుక్కెదురు


పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన హింసకు సంబంధించిన వివాదం రోజురోజుకూ ముదురుతోంది. అల్లర్లపై విచారణకు సంబంధించి కలకత్తా హైకోర్టులో మమతా బెనర్జీ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. హింసకు సంబంధించి గతంలో కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యాన్ని అదే హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. ఏసీజే రాజేశ్‌ బిందాల్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. కాగా, ముఖ్యమంత్రి మమత ప్రత్యేక సలహాదారు అలపన్‌ బంద్యోపాధ్యాయ్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు కేంద్రం నోటీసు పంపింది. వివరణ ఇచ్చేందుకు ఆయనకు నెల రోజుల గడువిచ్చింది. 
Updated Date - 2021-06-22T07:08:08+05:30 IST