ఫేస్‌బుక్‌ ఇండియా వైస్ ప్రెసిడెంట్‌కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ

ABN , First Publish Date - 2021-07-08T23:38:21+05:30 IST

ఢిల్లీ శాసన సభ శాంతి, సామరస్య కమిటీ సమన్లను సవాల్

ఫేస్‌బుక్‌ ఇండియా వైస్ ప్రెసిడెంట్‌కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ

న్యూఢిల్లీ : ఢిల్లీ శాసన సభ శాంతి, సామరస్య కమిటీ సమన్లను సవాల్ చేస్తూ ఫేస్‌బుక్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సమన్లు ఇచ్చే అధికారం ఈ కమిటీకి ఉందని తెలిపింది. అయితే నేరం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించినప్పటికీ చర్యలకు సిఫారసు చేసే అధికారం లేదని వివరించింది. ఈ నిబంధనలు శాంతిభద్రతలు, పోలీసుల పరిధిలోకి వస్తాయని పేర్కొంది. ఈ అంశాలపై ఢిల్లీ శాసన సభకు అధికారం లేదని తెలిపింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం ఈ తీర్పు చెప్పింది. 


ఫేస్‌బుక్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అజిత్ మోహన్‌కు ఢిల్లీ శాసన సభ శాంతి, సామరస్య కమిటీ గత ఏడాది సెప్టెంబరు 10, 18 తేదీల్లో నోటీసులు ఇచ్చింది. కమిటీ సమక్షంలో హాజరుకావాలంటూ ఇచ్చిన ఈ నోటీసులను సవాల్ చేస్తూ ఆయన గత ఏడాది సెప్టెంబరు 23న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 


‘‘పరిమితులు లేకుండా ప్రజలను ప్రభావితం చేసే శక్తి, సామర్థ్యాలు ఫేస్‌బుక్ వంటి సామాజిక మాద్యమ వేదికలకు ఉంది. ఈ వేదికలపై జరిగే చర్చలు, పెట్టే పోస్టుల్లోని కంటెంట్‌ గురించి వాస్తవాలు సరి చూసుకునే అవకాశాలు చాలా మందికి అందుబాటులో ఉండవు కాబట్టి, ఈ చర్చలు, పోస్టులు సమాజాన్ని ఓ వైపునకు కేంద్రీకరించవచ్చు’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. 


మోహన్‌పై ఎటువంటి నిర్బంధ చర్యలు చేపట్టరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. స్వయంగా మోహన్ హాజరుకావాలా? లేదంటే ఫేస్‌బుక్ తరపున ఎవరైనా హాజరు కావచ్చునా? చెప్పాలని వివరణ కోరింది. 


మోహన్ తరపున సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే వాదనలు వినిపిస్తూ, తన వేదికపై సమాచార మార్పిడి కోసం మధ్యవర్తిగా మోహన్ వ్యవహరిస్తారని, నాన్-స్టాట్యుటరీ కమిటీ సమక్షంలో హాజరై ప్రమాణం చేసి, చెప్పాలని ఆయనను నిర్బంధించరాదని అన్నారు. 


ఢిల్లీ శాసన సభ తరపున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి మాట్లాడుతూ, మోహన్ సాక్ష్యం చెప్పాలని ఈ నోటీసు చెప్పడం లేదన్నారు. కమిటీకి సహాయపడగలిగే సామర్థ్యం కలిగినటువంటి ఫేస్‌బుక్‌కు సంబంధించిన సీనియర్, బాధ్యతాయుతమైన వ్యక్తి హాజరుకావాలని తెలిపిందన్నారు. 


శాంతి, సామరస్య కమిటీ తరపున సీనియర్ అడ్వకేట్ రాజీవ్ ధావన్ వాదనలు వినిపిస్తూ, దేశ రాజధాని నగరం ఢిల్లీలో మత సామరస్యాన్ని దెబ్బతీయగలిగే పరిస్థితులు, అంశాలను నిర్మూలించేందుకు తగిన చర్యలను సూచించాలనే ఆదేశాలతోనే ఈ కమిటీ ఏర్పాటైందని చెప్పారు. వివిధ మతాలు, భాషలకు చెందినవారి మధ్య సామరస్యాన్ని ఏర్పాటు చేసేందుకు సలహాలు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. 


Updated Date - 2021-07-08T23:38:21+05:30 IST