ప్రేరణ కేంద్రంగా మారబోతున్న మోదీ చదివిన బడి!

ABN , First Publish Date - 2021-03-14T19:13:34+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బాల్యంలో చదివిన పాఠశాలను

ప్రేరణ కేంద్రంగా మారబోతున్న మోదీ చదివిన బడి!

అహ్మదాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బాల్యంలో చదివిన పాఠశాలను ప్రేరణ కేంద్రంగా మార్చబోతున్నారు. గుజరాత్‌లోని వాద్ నగర్, దర్బర్‌గధ్ ప్రాంతంలో ఉన్న ఈ పాఠశాలను అందరూ సందర్శించి, ప్రేరణ పొందేవిధంగా తీర్చిదిద్దబోతున్నట్లు అధికారులు తెలిపారు. కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాఘవేంద్ర సింగ్ నేతృత్వంలోని బృందం మార్చి 10న ఈ పాఠశాలను సందర్శించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 


మోదీ చదివిన బడిని ప్రేరణ కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఈ పాఠశాల భవనం నిర్మాణాన్ని సింగ్ నేతృత్వంలోని బృందం పరిశీలించినట్లు తెలిపారు. దీనిని అభివృద్ధి చేయడానికి ప్రణాళికను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఈ బృందం శర్మిష్ఠ సరస్సు తీరంలోని మ్యూజియంను కూడా సందర్శించిందని చెప్పారు. 


మెహసానా జిల్లా కలెక్టర్ హెచ్‌కే పటేల్ మాట్లాడుతూ, మోదీ చదివిన పాఠశాల ప్రాంగణంలో ప్రేరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాత్రమే పూర్తి వివరాలను తెలియజేయగలదని చెప్పారు. 


మోదీ చదివిన పాఠశాల దాదాపు 100 సంవత్సరాల క్రితంనాటిది. దీనిలో కొంత భాగం శిథిలావస్థలో ఉంది. ఈ భాగాన్ని మూసివేశారు. నరేంద్ర మోదీ పూర్వీకుల ఇంటికి సమీపంలోనే ఈ బడి ఉంది. 


కొందరు అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం, ఈ బడిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోణంలోనే కాకుండా ఆధ్యాత్మిక కోణంలో కూడా అభివృద్ధి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ హటకేశ్వర్ దేవాలయం, సోలంకి శకం నాటి కీర్తి తోరణం ఉన్న సంగతి తెలిసిందే. 
Updated Date - 2021-03-14T19:13:34+05:30 IST