‘మహా’ విషాదం

ABN , First Publish Date - 2021-05-20T06:35:49+05:30 IST

కళ్ల ముందే అపార ఆస్థి నష్టం... మరోవైపు భారీ ప్రాణ నష్టం... తీరం దాటుతూ తౌక్తే పెను తుఫాన్‌ మహా విషాదం మిగిల్చింది

‘మహా’ విషాదం

అరేబియా సముద్రంలో 26 మంది మృతి

మరో 49 మంది గల్లంతు.. నేవీ గాలింపు 

ముంబై సమీపంలో కొట్టుకుపోయిన బార్జ్‌ 

గుజరాత్‌లో వర్షాలకు 45 మంది మృతి

పశ్చిమ తీరంలో ‘తౌక్తే’ భారీ విధ్వంసం 

గుజరాత్‌లో ప్రధాని మోదీ ఏరియల్‌ సర్వే

రూ.1000 కోట్లు తక్షణ ఆర్థిక సాయం 

మహారాష్ట్రపై వివక్ష చూపారు: శివసేన, ఎన్సీపీ 


ముంబై/న్యూఢిల్లీ, మే 19: కళ్ల ముందే అపార ఆస్థి నష్టం... మరోవైపు భారీ ప్రాణ నష్టం... తీరం దాటుతూ తౌక్తే పెను తుఫాన్‌ మహా విషాదం మిగిల్చింది. పశ్చిమ తీరంలో భయానక విధ్వంసం సృష్టించింది. మరో 72 మందిని బలితీసుకుంది. అరేబియా సముద్రంలో కొట్టుకుపోయిన పీ-305 బార్జ్‌లో ఉన్న సిబ్బందిలో 26 మంది మరణించగా, మరో 49 మంది గల్లంతయ్యారు. మృతదేహాలను తీరానికి తరలించినట్టు నేవీ అధికారి వెల్లడించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. తుఫాన్‌ బీభత్సం సృష్టించిన గుజరాత్‌లో 45 మంది మృతిచెందారు. ముంబై సమీపంలో తుఫాన్‌ కల్లోలానికి సముద్రంలో లంగర్లు తెగి ఓఎన్‌జీసీకి చెందిన మూడు ఓడలు (బార్జ్‌లు) కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ‘ముంబై హై’ ప్రాంతం నుంచి కొట్టుకుపోయిన పీ-305 బార్జ్‌లో మొత్తం 261 మంది సిబ్బంది ఉండగా, వీరిలో 186 మందిని రక్షించినట్టు నేవీ అధికారి తెలిపారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. యుద్ధ నౌకలు, హెలికాప్టర్లతో నేవీ, కోస్టుగార్డు సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. సముద్రంలో కొట్టుకుపోయిన మరో బార్జ్‌లో (జీఏఎల్‌ కన్‌స్ట్రక్టర్‌) ఉన్న 137 మంది సిబ్బందిని రక్షించినట్టు తెలిపారు. అలాగే మరో బార్జ్‌ ఎస్‌ఎస్‌-3లో ఉన్న సిబ్బంది 196 మంది క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. తుఫాన్‌ తీరం దాటిన గుజరాత్‌లో భారీగా ప్రాణనష్టం వాటిల్లింది. ఆ రాష్ట్రంలో 12 జిల్లాల్లో 45 మంది మరణించారు.  


రాజస్థాన్‌, ఢిల్లీలో భారీ వర్షాలు 

కేరళ నుంచి గుజరాత్‌ వరకూ పశ్చిమ తీరంలో బీభత్సం సృష్టించిన తుఫాన్‌ తీరం దాటక వాయుగుండంగా బలహీనపడింది. దీని ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. రాజస్థాన్‌, హరియాణా, ఢిల్లీల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజస్థాన్‌లోని దుంగాపూర్‌ జిల్లా వేజలో 23.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఛండీగఢ్‌, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు కురవొచ్చని ఐఎండీ హెచ్చరించింది. కాగా మరో తుఫా న్‌ ఏర్పడనుందని ఐఎండీ హెచ్చరించింది. 22న అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం ఏర్పడవచ్చని సూచించింది. ఇది బలపడి తుఫాన్‌గా మారి 26, 27 తేదీల్లో ఒడిసా-పశ్చిమ బెంగాల్‌ తీరం తాకొచ్చని తెలిపింది.  


గుజరాత్‌ను ఆదుకుంటాం: మోదీ  

తుఫాన్‌తో భారీగా ఆస్థి, ప్రాణ నష్టం జరిగిన గుజరాత్‌కు ప్రధాని మోదీ రూ.1000 కోట్లు తక్షణ ఆర్థిక సాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50 వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బుధవారం గుజరాత్‌, డయ్యూలో ప్రధాని మోదీ ఏరియల్‌ సర్వే నిర్వహించారు. గిర్‌ సోమనాథ్‌, భావ్‌నగర్‌, అమ్రేలి జిల్లాలో తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందని, ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కాగా, సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటించిన ప్రధాని మోదీ పక్కనే ఉన్న మహారాష్ట్రకు ఎందుకు రాలేదని, ఇది వివక్ష కాదా అని ఎన్సీపీ, శివసేన ప్రశ్నించాయి. 

Updated Date - 2021-05-20T06:35:49+05:30 IST