రాజ్యాంగం అంటే ఆధునిక భగవద్గీత : ఓం బిర్లా

ABN , First Publish Date - 2021-11-26T21:18:47+05:30 IST

భారత దేశ రాజ్యాంగం ఆధునిక భగవద్గీత వంటిదని, దేశం

రాజ్యాంగం అంటే ఆధునిక భగవద్గీత : ఓం బిర్లా

న్యూఢిల్లీ : భారత దేశ రాజ్యాంగం ఆధునిక భగవద్గీత వంటిదని, దేశం కోసం కృషి చేయడానికి ఇది తమను ప్రేరేపిస్తుందని లోక్‌సభ సభాపతి ఓం బిర్లా అన్నారు. దేశం కోసం పని చేయడానికి ప్రతి ఒక్కరూ కట్టుబడితే, ‘ఒకే భారత దేశం-శ్రేష్ఠమైన భారత దేశా’న్ని నిర్మించవచ్చునని తెలిపారు. రాజ్యాంగ దినోత్సవాల సందర్భంగా పార్లమెంటు హాలులో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తదితరులు పాల్గొన్నారు. 


ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, వామపక్షాలు, టీఎంసీ, ఆర్జేడీ, శివసేన, ఎన్‌సీపీ, ఎస్‌పీ తదితర పార్టీలు పాల్గొనలేదు. రాజ్యాంగానికి 1949 నవంబరు 26న రాజ్యాంగ సభ ఆమోదం లభించింది. 2015 నుంచి రాజ్యాంగ దినోత్సవాలను నిర్వహిస్తున్నారు. 


ఈ నేపథ్యంలో ఓం బిర్లా మాట్లాడుతూ, రాజ్యాంగ దినోత్సవాల్లో ప్రతిపక్ష పార్టీలు పాల్గొని ఉండవలసిందన్నారు. ఈ ఉత్సవాలు ప్రభుత్వానికి సంబంధించినవి కాదని, పార్లమెంటుకు సంబంధించినవని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని ప్రతిపక్షాలు నిర్ణయించడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, గవర్నర్ ప్రసంగాలను బహిష్కరించే సంప్రదాయం లేకుండా చూడాలని తాను కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి వేదికపై కూర్చునేందుకు ఆసనాలను కేటాయించినట్లు తెలిపారు. వారికి ఈ విషయాన్ని ముందుగానే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, లోక్‌సభ సభాపతి కార్యాలయం తెలియజేసినట్లు చెప్పారు. అయినప్పటికీ వారు హాజరు కాలేదన్నారు. తమకు సీట్లు కేటాయించలేదని ఆరోపించారని, అది వాస్తవం కాదని వివరించారు. 


Updated Date - 2021-11-26T21:18:47+05:30 IST