తాలిబన్లపై ఉగ్రవాద సంస్థల ప్రశంసలు

ABN , First Publish Date - 2021-08-20T18:15:18+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌కు విముక్తి కల్పించారంటూ తాలిబన్లను ఉగ్రవాద సంస్థలు

తాలిబన్లపై ఉగ్రవాద సంస్థల ప్రశంసలు

కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్‌కు విముక్తి కల్పించారంటూ తాలిబన్లను ఉగ్రవాద సంస్థలు ప్రశంసిస్తున్నాయి. అల్ ఖైదా ఇన్ అరేబియన్ పెనిన్సులా (ఏక్యూఐపీ), దాని అనుబంధ సంస్థలు  ప్రశంసలు కురిపించాయి. అమెరికా నేతృత్వంలోని దళాలను, అష్రఫ్ ఘనీ ప్రభుత్వాన్ని ఎదిరించి, విజయం సాధించినందుకు ఓ ప్రకటనలో ఏక్యూఐపీ అభినందించింది. కాబూల్‌ను ఆదివారం తాలిబన్లు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో అల్ ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థలు వారిని అభినందిస్తూ ప్రకటనలు ఇచ్చాయి. 


తాలిబన్లు సాటిలేని దృఢత్వానికి నిదర్శనమని, తమకు స్ఫూర్తిదాయకులని హయత్ తహ్రిర్ అల్-షమ్ ఇన్ సిరియా (హెచ్‌టీఎస్) పేర్కొంది. ఆఫ్ఘనిస్థాన్‌లో ఇస్లామిక్ స్టేట్‌ను ఏర్పాటు చేసినందుకు తాలిబన్లను పశ్చిమ చైనాలోని తుర్కిస్థాన్ ఇస్లామిక్ పార్టీ అభినందనలు తెలిపింది. తెహరీక్-ఈ-తాలిబన్ పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ తాలిబన్లను అభినందిస్తూనే, పాకిస్థాన్ సైన్యంపై పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపింది. 


హెచ్‌టీఎస్ ఉగ్రవాద సంస్థ వాయవ్య సిరియాలో శక్తిమంతంగా ఉంది. ‘‘నీతి గెలిచి తీరుతుంది, అయితే దానికి ఎంత కాలం పట్టిందనేది పెద్ద విషయం కాదు’’ అని పేర్కొంది. దురాక్రమణదారులు ఆక్రమిత భూముల్లోని ప్రజలకు ఎంత హాని చేసినా, అక్కడ ఎంతో కాలం ఉండలేరని పేర్కొంది. తాలిబన్ల అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని సిరియాలో తాము కూడా విజయం సాధిస్తామని, బషర్ అల్-అసద్ ప్రభుత్వాన్ని కూలదోసి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆశిస్తున్నట్లు తెలిపింది. సిరియా విప్లవానికి కూడా విజయాన్ని అందించాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొంది. 


Updated Date - 2021-08-20T18:15:18+05:30 IST