పది రాష్ట్రాలకు కేంద్ర వైద్య బృందాలు

ABN , First Publish Date - 2021-12-26T07:05:53+05:30 IST

: కొవిడ్‌ కేసులతో పాటు మరణాల్లో అనూహ్య పెరుగుదల, ఒమైక్రాన్‌ కేసులు కూడా అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో...

పది రాష్ట్రాలకు   కేంద్ర వైద్య బృందాలు

 కొవిడ్‌ వ్యాప్తి పెరుగుదలతో నిర్ణయం

న్యూఢిల్లీ, డిసెంబరు 25: కొవిడ్‌ కేసులతో పాటు మరణాల్లో అనూహ్య పెరుగుదల, ఒమైక్రాన్‌ కేసులు కూడా అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో పది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం వైద్య బృందాలను పంపనుంది. ఈ జాబితాలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, యూపీ, పశ్చిమబెంగాల్‌, పంజాబ్‌, జార్ఖండ్‌, బిహార్‌, మిజోరం ఉన్నాయి. అధికారికంగా వెల్లడిస్తున్న గణాంకాలతో పాటు, మీడియా కథనాలు, అంతర్గత సమీక్షలను ఆధారం చేసుకుని వైద్య బృందాలను పంపాలని కేంద్రం నిర్ణయించింది. వీటిలో కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌ పంపిణీ జాతీయ స్థా యి సగటు కంటే తక్కువగా ఉందని కేంద్ర ప్రభు త్వం పేర్కొంది. మల్టీ డిసిప్లినరీ వైద్య నిపుణులతో కూడిన ఈ బృందాలు రాష్ట్రాలలో మూడు నుంచి ఐదు రోజులు పర్యటిస్తాయి. రాష్ట్రాల్లో మాస్క్‌ల ధారణ, సామాజిక దూరం పాటింపు వంటి కొవిడ్‌ మార్గదర్శకాల అమలు తీరును కేంద్ర బృందాలు గమనించనున్నాయి. ఇదే సమయంలో టీకా పంపిణీ ప్రగతిని తెలుసుకుంటాయి. ఆస్పత్రుల్లో పడకల అందుబాటు, అంబులెన్సులు, వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ తదితర వైద్య వసతులను పరిశీలిస్తాయి.  


ఢిల్లీ, ముంబైలో మళ్లీ కొవిడ్‌ భయాలు

ఢిల్లీలో శనివారం 249 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. జూన్‌ 13 తర్వాత  ఇవే అత్యధికం. ఒకరు చనిపోయారు. పాజిటివ్‌ రేటు 0.43కు పెరిగింది.  ఢిల్లీలో 6 నెలల తర్వాత గురువారం కేసులు వంద  దాటాయి. శుక్రవారం 180కి (పాజిటివ్‌ రేటు 0.29) పెరిగాయి. ఇక ముంబైలో శనివారం 757 పాజిటివ్‌లు వచ్చాయి. బుధవారం 490, గురువారం 603, శుక్రవారం 693 కేసులు రాగా.. తాజాగా మరింత పెరిగాయి. కర్ణాటకలోని కోలార్‌లో ఉన్న దేవరాజ్‌ అర్స్‌ వైద్య కళాశాలలో 30 మందికి కొవిడ్‌ సోకింది.  వీరి నమూనాలను జన్యు విశ్లేషణకు పంపారు. ఆరు నెలల గరిష్ఠ స్థాయిలో 43 కరోనా కేసుల నమోదుతో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 3 ప్రాంతాలను సూక్ష్మ కట్టడి ప్రాంతాలుగా ప్రకటించారు. కాగా, దేశంలో శనివారం నాటికి ఒమైక్రాన్‌ కేసులు 415కి పెరిగాయి. మహారాష్ట్రలో వంద (108) దాటాయి. 

Updated Date - 2021-12-26T07:05:53+05:30 IST