మీవల్లే ఓడిపోయాం...

ABN , First Publish Date - 2021-07-08T13:22:23+05:30 IST

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పట్ల ఎన్‌డీఏ భాగస్వామ్య పార్టీలైన అన్నాడీఎంకే బీజేపీ పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. ఓటమికి కారణం మీరంటే మీరేనంటూ దుమ్మె

మీవల్లే ఓడిపోయాం...

            - అన్నాడీఎంకే, బీజేపీ పరసప్పరారోపణలు


చెన్నై: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పట్ల ఎన్‌డీఏ భాగస్వామ్య పార్టీలైన అన్నాడీఎంకే బీజేపీ పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. ఓటమికి కారణం మీరంటే మీరేనంటూ దుమ్మెత్తిపోసుకున్నాయి. ఈ వ్యవహారం కూటమిలో చిచ్చురేపుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తుకుదుర్చుకున్న బీజేపీ 20 నియోజకవర్గాలలో పోటీ చేసి నాలుగుచోట్ల గెలిచింది. రెండు దశాబ్దాల తర్వాత బీజేపీ శాసనసభ్యులు రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం రెండు పార్టీల మధ్య చిచ్చురగిలింది. తొలుత అన్నాడీఎంకే ఓటమికి బీజేపీతో పొత్తుపెట్టుకోవడమే కారణమని ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి సీవీ షణ్ముగం ఆరోపించారు. ఆ ఆరోపణలు ఖండిస్తూ బీజేపీ సీనియర్‌ నేత రాఘవన్‌.. తమ పార్టీ ఆశించిన రీతిలో అధిక సీట్లలో గెలవకపోవడానికి అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడమేననే అభిప్రాయం తమకు కూడా కలుగుతోందని ట్వీట్‌ చేశారు. విల్లుపురం జిల్లా మరక్కాణం సమీపం గురువమ్మాపేట గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై అన్నాడీఎంకే స్థానిక శాఖ నాయకుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో అన్నాడీఎంకే సీనియర్‌ నాయకుడు, మాజీ న్యాయశాఖ మంత్రి సీవీ షణ్యుగం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ మిత్రపక్షమైన బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రంలో డీఎంకే మళ్ళీ అధికారంలోకి రావాలని రాష్ట్ర ప్రజలు భావించలేదని, వాస్తవానికి మూడోసారి అన్నాడీఎంకే అధికారంలోకి రావాలని ఆశించారని, అయితే పార్టీపరంగా తీసుకున్న నిర్ణయాల కారణంగా అధికారంలోకి రాలేకపోయామని అన్నారు. అంతటితో ఆగకుండా ఎన్నికలలో ఘోరపరాజయాన్ని చవి చూడటానికి బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడమే ప్రధాన కారణమని, ఆ పొత్తు వల్ల మైనారిటీ వర్గాలకు చెందిన ప్రజలు అన్నాడీఎంకేకు ఓటు వేయలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీవీ షణ్ముగం చేసిన ఆరోపణలను ఖండిస్తూ బీజేపీ ప్రధాన కార్యదర్శి కేటీ రాఘవన్‌ ట్విట్టర్‌ సందేశం వెలువరించారు. అన్నాడీఎంకేతో పొత్తుపెట్టు కోవడం వల్లే బీజేపీ పోటీ చేసిన అన్నిచోట్లా విజయం సాధించలేకపోయిందని పేర్కొన్నారు. ఈ విషయమై రాఘవన్‌ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ... బీజేపీతో పొత్తు పెట్టుకున్నందువల్లే అన్నాడీఎంకే ఓడిపోయిందని ఆ పార్టీ ఉప సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం ఆరోపించివుంటే తగిన రీతిలో తాము సమాధానం చెప్పగలమని అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ 300కు పైగా లోక్‌సభ స్థానాల్లో గెలిచి అధికారంలో ఉందని, పలు రాష్ట్రాలలో మైనారిటీ ఓట్లను కూడా సంపాదించిందని ఆయన గుర్తు చేశారు. సీవీ షణ్ముగం చెబుతున్న ఆరోపణలు సమంజసంగా లేవని అన్నారు. అన్నాడీఎంకే నాలుగేళ్ల పాలనపై రాష్ట్ర ఓటర్లు తీర్పునిచ్చారని, ఆ తీర్పును అన్ని పార్టీలు శిరసావహించాల్సిందేనని అన్నారు. అన్నాడీఎంకే కూటమి ఓటమిచెందినందుకు గల కారణాలపై ఆ పార్టీ అధిష్ఠానం సమీక్షించాల్సి ఉందన్నారు. సీవీ షణ్ముగం ఆరోపణలపై బీజేపీ రాష్ట్ర శాఖ కోశాధికారి ఎంఎస్‌ శేఖర్‌ కూడా ధ్వజమెత్తారు. సీవీ షణ్ముగం వ్యాఖ్యలు అన్నాడీఎంకే అధిష్టానం అభిప్రాయాలు కావనే భావిస్తున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పార్టీకి విరుద్ధంగా మాట్లాడుతున్న షణ్ముగంపై అన్నాడీఎంకే అధిష్ఠానం చర్యలు తీసుకోవాలని రాఘవన్‌ డిమాండ్‌ చేశారు.


బీజేపీతో పొత్తు పటిష్టం : ఈపీఎస్‌, ఓపీఎస్‌

బీజేపీతో అన్నాడీఎంకే పొత్తు కొనసాగుతుందని ఆ పార్టీ ఉపసమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం స్పష్టం చేశారు. ఈ మేరకు వారిద్దరూ బుధవారం సాయంత్రం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. రెండు పార్టీల మధ్య పొత్తు పటిష్టంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. శాసనసభ ఎన్నికల్లో ఓటమికి మీతో పొత్తుపెట్టుకోవడమే కారణమంటూ అన్నాడీఎంకే మాజీ మంత్రి సీవీ షణ్ముగం, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేటీ రాఘవన్‌ పరస్పరారోపణలకు పాల్పడిన నేపథ్యంలో ఈ ప్రకటన జారీ చేశారు.


Updated Date - 2021-07-08T13:22:23+05:30 IST