Afghanistan: ఘజ్ని నగరాన్ని చుట్టుముట్టేసిన తాలిబన్లు

ABN , First Publish Date - 2021-07-12T23:10:46+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్ మళ్లీ తాలిబన్ల చెరలోకి వెళ్లిపోతోంది. ఆప్ఘాన్ గడ్డపై నుంచి అమెరికా సేనలు వెనుదిరగడంతో

Afghanistan: ఘజ్ని నగరాన్ని చుట్టుముట్టేసిన తాలిబన్లు

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ మళ్లీ తాలిబన్ల చెరలోకి వెళ్లేలా కనిపిస్తోంది. ఆప్ఘాన్ గడ్డపై నుంచి అమెరికా సేనలు వెనుదిరగడంతో లభించిన స్వేచ్ఛ తాలిబన్లను నిలవడనీయడం లేదు. వరుస దాడులతో పెట్రేగిపోతున్నారు.


 నగరాలపై దాడులు చేస్తూ ప్రభుత్వంపై పట్టుసాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా సెంట్రల్ ఆఫ్ఘనిస్థాన్‌లోని ఘజ్ని నగరాన్ని చుట్టుముట్టారు. స్థానికుల ఇళ్లను స్థావరాలుగా ఉపయోగించుకుంటూ భద్రతా దళాలపై విరుచుకుపడుతున్నారు. 


ఘజ్నిలో ప్రస్తుత పరిస్థితి చాలా దారుణంగా ఉన్నట్టు నగర ప్రావిన్షియల్ కౌన్సిల్ సభ్యుడు హసాన్ రెజాయి పేర్కొన్నారు. ఆఫ్ఘాన్ భద్రతా దళాలు (ఏఎన్‌డీఎస్ఎఫ్)పై దాడుల కోసం తాలిబన్లు స్థానికుల ఇళ్లను స్థావరాలుగా ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. దీంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 


ఆఫ్ఘనిస్థాన్‌లో 20 ఏళ్లుగా ఉన్న అమెరికా దళాలను వెనక్కి పిలిపిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఏప్రిల్‌లో ప్రకటించారు. సెప్టెంబరు 11 నాటికి మొత్తం దళాలను ఉపసంహరించుకుంటామని తెలిపారు.


ఈ ప్రకటన తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌లో హింస పెచ్చుమీరింది. మరోవైపు, గత నాలుగు రోజులుగా తాలిబన్లు కాందహార్ నగరంపై పశ్చిమ వైపు నుంచి దాడి చేస్తున్నట్టు పార్లమెంటు మాజీ సభ్యుడు హమిద్‌జాయ్ లాలే తెలిపారు.


అయితే, ప్రస్తుతం కాందహార్‌లో పరిస్థితి పూర్తిగా ఆఫ్ఘాన్ దళాల అదుపులోనే ఉందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఫవాద్ అమన్ తెలిపారు. తాలిబన్లు ప్రస్తుతానికి ప్రావిన్షియల్ రాజధానులపై పట్టు సాధించనప్పటికీ ఆఫ్ఘాన్ దళాలపై మాత్రం ఒత్తిడి పెంచుతున్నారు. 

Updated Date - 2021-07-12T23:10:46+05:30 IST