తాలిబాన్ల పాలన కసరత్తు షురూ!
ABN , First Publish Date - 2021-08-25T07:50:15+05:30 IST
అఫ్ఘానిస్థాన్‌లో తాలిబాన్ల పాలన దిశగా కసరత్తు షురూ అయింది. ప్రభుత్వ ఏర్పాటు, అధికార మార్పిడి ప్రక్రియ ఇంకా పూర్తికాకపోయినా..

పలు శాఖలకు అధిపతుల నియామకం
కాబుల్, ఆగస్టు 24: అఫ్ఘానిస్థాన్‌లో తాలిబాన్ల పాలన దిశగా కసరత్తు షురూ అయింది. ప్రభుత్వ ఏర్పాటు, అధికార మార్పిడి ప్రక్రియ ఇంకా పూర్తికాకపోయినా.. దేశ ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలంగా మారిన నేపథ్యంలో తాలిబాన్లు తమ దేశానికి కొత్త ఆర్థిక మంత్రిని ప్రకటించారు. అలాగే.. కొత్త నిఘా విభాగాధిపతిని, హోం మంత్రిని కూడా నియమించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. గుల్ అఘా అఫ్ఘాన్ కొత్త ఆర్థిక మంత్రిగా. సద్ర్ ఇబ్రహీమ్ తాత్కాలిక హోం మంత్రిగా వ్యవహరించనున్నారు. అలా గే.. విద్యాశాఖ అధిపతిగా సఖావుల్లా, ఉన్నతవిద్యా శాఖ అధిపతిగా అబ్దుల్ బకీ, నజీబుల్లా ఇంటెలిజెన్స్ చీఫ్‌గా, ముల్లా షిరిన్ కాబూల్ గవర్నర్‌గా, హమ్‌దుల్లా కాబూల్ మేయర్‌గా విధులు నిర్వర్తిస్తారని తెలుస్తోంది. దీనిపై ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. అఫ్ఘాన్ రిజర్వు బ్యాంకు అధ్యక్షుడిగా తాత్కాలికంగా హాజీ మొహమ్మద్ ఇద్రి్‌సను నియమించినట్టు తాలిబాన్ల అధికార ప్రతినిధి జబీహల్లా ముజాహిద్ సోమవారమే ప్రకటించారు. కాగా.. అమెరికా సైన్యానికి సహకరించిన పౌరుల బయోమెట్రిక్ వివరాలన్నీ తాలిబాన్లకు అందుబాటులో ఉన్నాయని కెనడాకు చెందిన లూసియా నల్బందియన్ ఆందోళన వ్యక్తం చేశారు. 2007లో అమెరికా సైనికులు.. చేతిలో పట్టుకోగలిగే చిన్న పరికరం(హ్యాండ్ హెల్డ్ ఇంటర్ ఏజెన్సీ ఐడెంటిటీ డిటెక్షన్ ఎక్వి్‌పమెంట్(హైడ్))లో 15 లక్షల మంది కనుపాపల వివరాలు, వేలిముద్రలు, ముఖ కవళికలను సేకరించారు. ఆ పరికరం ఇప్పుడు తాలిబాన్ల చేతుల్లోకి వచ్చి ఉంటుందని లూసియా అంచనా వేస్తున్నారు. అమెరికా నిఘా సంస్థ సీఐఏ డైరెక్టర్ విలియం జే బర్న్స్ సోమవారం కాబూల్‌లో.. తాలిబాన్ ప్రముఖ నేత అబ్దుల్ ఘనీ బరాదర్‌తో రహస్యంగా ముఖాముఖి సమావేశమైనట్టు సమాచారం. కాబూల్‌పై తాలిబాన్లు పట్టు సాధించాక.. అటు అమెరికా నుంచి, ఇటు తాలిబాన్ల నుంచి అత్యున్నతస్థాయి నేతలు ముఖాముఖి భేటీ కావడం ఇదే మొదటిసారి. కాగా.. అఫ్ఘానిస్థాన్ నుంచి వివిధ దేశాలకు పారిపోయిన 20 వేల మంది అఫ్ఘాన్లకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఉచిత వసతి సదుపాయం కల్పిస్తామని ప్రముఖ వెబ్‌సైట్ ఎయిర్‌బీఎన్‌బీ ప్రకటించింది.
ఆహారాన్ని ఆపేశారు..
తాలిబాన్ల పాలనను వ్యతిరేకిస్తున్న అందరాబ్ లోయ ప్రాంతానికి వారు ఆహారం, చమురు సరఫరాను నిలిపివేశారని.. అక్కడి పరిస్థితి దయనీయంగా ఉందని అఫ్ఘాన్ ఉపాధ్యక్షుడు, ఇటీవలే తనను తాను అఫ్ఘాన్ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న అమ్రుల్లా సలేహ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో తాలిబాన్లు మానవ హక్కుల హననానికి పాల్పడుతున్నారని ఆందోళన వెలిబుచ్చారు. మరోవైపు.. అఫ్ఘానిస్థాన్‌లో చిక్కుకుపోయిన ఉక్రెయిన్‌వాసులను తరలించేందుకు వెళ్లిన తమ విమానం హైజాక్‌కు గురైందని.. ఆ విమానాన్ని ఇరాన్‌కు తరలించారని ఉక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి ఎవ్‌జెనీ ఎనిన్ తెలిపారు. కానీ, ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ఈ ఆరోపణలను ఖండించింది. తమ విమానాలేవీ హైజాక్‌కు గురికాలేదని స్పష్టం చేసింది. అటు ఇరాన్ కూడా దీన్ని కొట్టిపారేసింది.