దుబాయ్ పారిపోయిన తాలిబన్ మంత్రి

ABN , First Publish Date - 2021-10-19T21:29:52+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్ల మధ్య విభేదాలు

దుబాయ్ పారిపోయిన తాలిబన్ మంత్రి

న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్ల మధ్య విభేదాలు తలెత్తడంతో తాలిబన్ సీనియర్ నేత, విదేశీ వ్యవహారాల శాఖ డిప్యూటీ మినిస్టర్ షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టనిక్జాయ్ కాబూల్ నుంచి దుబాయ్ పారిపోయారు. పాకిస్థానీ గూఢచార సంస్థ ఐఎస్ఐ తనను హత్య చేయవచ్చుననే భయాందోళనతో ఆయన పారిపోయినట్లు తెలుస్తోంది.


తాను తిరిగి ఆఫ్ఘనిస్థాన్ వస్తే, తనను పాకిస్థానీ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) చంపుతుందనే భయంతో స్టనిక్జాయ్ ఆఫ్ఘనిస్థాన్‌ను వదిలి దుబాయ్‌ వెళ్ళిపోయారని అనేక వర్గాలు ధ్రువీకరించాయి. దుబాయ్‌లో ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆయనకు రష్యాతో సన్నిహిత సంబంధాలు, భారత దేశంతో సంబంధాలు ఉన్నట్లు తాలిబన్ ప్రభుత్వంలోని హక్కానీ గ్రూప్ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆయన ఇండియన్ మిలిటరీ అకాడమీలో చదువుకున్నారు. ఆఫ్ఘన్‌ను ఆగస్టులో స్వాధీనం చేసుకున్న తర్వాత తాలిబన్లతో భారత్ మొట్టమొదటిసారి సంప్రదించినపుడు స్టనిక్జాయ్‌తోనే మాట్లాడింది. అప్పట్లో ఆయన దోహాలోని తాలిబన్ రాజకీయ కార్యాలయం అధిపతిగా ఉండేవారు. 


భారత దేశంతో రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను కొనసాగించాలని తాలిబన్లు కోరుకుంటున్నట్లు స్టనిక్జాయ్ అప్పట్లో చెప్పారు. ఆయనకు భారత దేశంతోగల అనుమానాస్పద సంబంధాల పట్ల తాలిబన్లలోని హక్కానీ గ్రూపు, పాకిస్థానీ ఐఎస్ఐ ఆందోళన చెందాయి. ఇప్పుడు ఆయన తాలిబన్లలో ఒంటరివాడిగా మిగిలిపోయారు. Updated Date - 2021-10-19T21:29:52+05:30 IST