రాజకీయ నేతల కేసుల్లో జాప్యం... సీబీఐ, ఈడీలపై సుప్రీం ఆగ్రహం...

ABN , First Publish Date - 2021-08-25T22:29:43+05:30 IST

చట్ట సభల సభ్యులపై సీబీఐ, ఈడీ కేసుల దర్యాప్తులో

రాజకీయ నేతల కేసుల్లో జాప్యం... సీబీఐ, ఈడీలపై సుప్రీం ఆగ్రహం...

న్యూఢిల్లీ : చట్ట సభల సభ్యులపై సీబీఐ, ఈడీ కేసుల దర్యాప్తులో జాప్యం జరుగుతుండటంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల్లో 10-15 సంవత్సరాలవుతున్నా ఛార్జిషీట్లు ఎందుకు దాఖలు చేయడం లేదని నిలదీసింది. ఈడీ కేవలం ఆస్తులను జప్తు చేయడం మినహా ఇంకేమీ చేయడం లేదని మండిపడింది. 


పార్లమెంటు సభ్యులు, శాసన సభల సభ్యులపై నమోదైన కేసుల దర్యాప్తులో జాప్యం ఎందుకు జరుగుతోందో వివరించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి దర్యాప్తు సంస్థలను ఆదేశించారు. చట్ట సభల సభ్యులపై నమోదైన కేసుల్లో దర్యాప్తు ఎందుకు నత్తనడకన సాగుతోందని ప్రశ్నించారు. కేసులు నమోదై 10-15 ఏళ్ళు అవుతున్నప్పటికీ ఛార్జిషీట్లను ఎందుకు దాఖలు చేయడం లేదని నిలదీశారు. కేసులను సాగదీయవద్దని, ఛార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. ప్రజలకు న్యాయం చేయడానికి సత్వర విచారణలు అవసరమని చెప్పారు. ఈ సంస్థలకు వ్యతిరేకంగా తాము మాట్లాడాలని అనుకోవడం లేదని, వాటి నైతిక బలాన్ని తగ్గించాలని కోరుకోవడం లేదని అన్నారు. అయితే పెండింగ్ కేసుల సంఖ్య అనేక అంశాలను వెల్లడిస్తుందన్నారు. దురుద్దేశాలతో నమోదయ్యే కేసులను ఉపసంహరించుకోవడం తప్పేమీ కాదని, అయితే ఈ ప్రక్రియను సంబంధిత రాష్ట్ర హైకోర్టు పరిశీలించాలన్నారు. 


ఆశ్చర్యం వ్యక్తం చేసిన జస్టిస్

కోర్టుకు సహాయపడుతున్న అమికస్ క్యూరీ విజయ్ హన్సరియా మాట్లాడుతూ, ఓ కేసును దర్యాప్తు చేస్తున్న సంస్థ 2030నాటికి ఆ దర్యాప్తు ముగుస్తుందని చెప్పిందన్నారు. దీంతో ఈ ధర్మాసనంలోని మరొక న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘‘మై గాడ్!’’ అన్నారు. పదేళ్ళకుపైగా గడిచిపోయినప్పటికీ, దర్యాప్తు పూర్తి కాని కేసులు సుమారు 50 శాతం ఉన్నాయని విజయ్ సుప్రీంకోర్టుకు తెలిపారు. 


భారం ఉందని తెలుసు

జస్టిస్ రమణ, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం స్పందిస్తూ, జాప్యం జరుగుతుండటానికి కారణాలను దర్యాప్తు సంస్థలు చెప్పడం లేదని పేర్కొంది. కోర్టుల మాదిరిగానే దర్యాప్తు సంస్థలకు కూడా సిబ్బంది కొరత ఉందని పేర్కొంది. కేసు చిన్నదైనా, పెద్దదైనా సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతున్నారని వ్యాఖ్యానించింది. కోర్టుల మాదిరిగానే ఈ సంస్థలపై కూడా భారం ఉన్నట్లు అర్థం చేసుకోగలమని పేర్కొంది. కొన్ని కేసుల్లో ఈ సంస్థలు ప్రత్యేక పద్ధతులను అవలంబించవలసి ఉంటుందని, వనరులు అవసరమవుతాయని పేర్కొంది. అవసరమైన మౌలిక సదుపాయాలను ఈ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం సమకూర్చాలని తెలిపింది. 


మహమ్మారి ప్రభావం

కోవిడ్-19 మహమ్మారి ప్రభావం కోర్టులపై పడిందని, దర్యాప్తు సంస్థలపై ఆ ప్రభావం లేదని, సాధ్యమైనంత ఉత్తమంగా ఎందుకు పని  చేయడం లేదని ప్రశ్నించింది. సీజేఐ జస్టిస్ రమణ మాట్లాడుతూ, ప్రజా ప్రతినిధులకు సంబందించిన కేసులు కావడం వల్ల వారు కూడా తమ అధికారాన్ని దుర్వినియోగపరుస్తారని, అందువల్ల ప్రత్యేక షరతులను విధించామని అన్నారు. హైకోర్టు అనుమతి లేకుండా ఇటువంటి కేసులను ఉపసంహరించడానికి వీల్లేదని గతంలో జరిగిన విచారణ సందర్భంగా చెప్పామని గుర్తు చేశారు. 


ఏకీభవించిన ప్రభుత్వ న్యాయవాది

సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తూ, ప్రతి కేసు గురించి ప్రస్తావించకుండా, ఈ కేసులపై దర్యాప్తును వేగవంతం చేయాలనడంతో ఏకీభవిస్తానని చెప్పారు. దీనిపై సీజేఐ మాట్లాడుతూ, వేగవంతం చేయాలని చెప్పడం సులువేనని, అలా ఎక్కడ జరుగుతోందని ప్రశ్నించారు. ఈ కేసులపై దర్యాప్తులో జాప్యం ఎందుకు జరుగుతోందో కారణాలను తదుపరి విచారణలో తెలియజేయాలని మెహతాను ఆదేశించారు. దర్యాప్తును నిర్ణీత కాలంలో వేగంగా పూర్తి చేయడానికి అదనపు సిబ్బంది, వనరులు అవసరమవుతాయేమో చెప్పాలన్నారు. 


నేరగాళ్ల పోటీని నిషేదించాలి

న్యాయవాది, బీజేపీ నేత అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. దోషులుగా నిర్థారణ అయిన ఎంపీలు, ఎమ్మెల్యేలు జీవిత కాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని ఈ పిటిషన్ కోరింది. ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదయ్యే కేసుల విచారణ వేగంగా జరగడం కోసం ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలని కోరింది. 


Updated Date - 2021-08-25T22:29:43+05:30 IST