సోషల్ మేనియా
ABN , First Publish Date - 2021-09-03T07:16:36+05:30 IST
వార్తలకు ఒక వర్గం మీడియా మతం రంగు పులుముతోందని, ఫలితంగా దేశానికి చెడ్డపేరు వస్తోందని సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది

- జవాబుదారీతనం లేని వెబ్ పోర్టళ్లు, ఫేస్‌బుక్, ట్విటర్
- బూటకపు వార్తల నిలయంగా యూట్యూబ్ చానళ్లు
- సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు రాసి హక్కంటున్నారు
- బలవంతుల గుప్పిట్లో.. జడ్జిల మాటలూ పట్టించుకోవట్లే
- ఫేక్ న్యూస్ నియంత్రణకు ఎప్పుడైనా ప్రయత్నించారా!?
- ఓ వర్గం మీడియా ప్రతి విషయాన్నీ
- మతం కోణంలో చూడడమే దేశంలో అసలు సమస్య
- తబ్లిఘీ జమాత్ పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీం
- కొత్త ఐటీ రూల్స్‌పై హైకోర్టుల్లో పిటిషన్లన్నీ సుప్రీంకు
వెబ్ పోర్టళ్లు, యూట్యూబ్ చానళ్లలో ప్రసారమయ్యే ఫేక్ న్యూస్, నిందలు, దూషణలపై ఎవరికీ నియంత్రణ లేదు. యూట్యూబ్ చూస్తే చాలు.. బూటకపు వార్తలు ఎంత విచ్చలవిడిగా ప్రసారమవుతున్నాయో అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరైనా యూట్యూబ్‌లో చానల్ ప్రారంభించుకోవచ్చు. సోషల్ మీడియాలో అటువంటి కంటెంట్ నియంత్రణకు ఏదైనా కమిషన్ ఏర్పాటు చేశారా?
- చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): వార్తలకు ఒక వర్గం మీడియా మతం రంగు పులుముతోందని, ఫలితంగా దేశానికి చెడ్డపేరు వస్తోందని సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెబ్ పోర్టళ్లు, యూట్యూబ్ సహా సామాజిక మాధ్యమాల్లోని ఫేక్ న్యూస్‌పై ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయమూర్తులు, సంస్థల మాటను పట్టించుకోకుండా ‘శక్తిమంతమైన గళాల’ను మాత్రమే సోషల్ మీడియా వింటోందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తప్పుబట్టింది. గత ఏడాది ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో తబ్లిఘీ జమాత్ సభ్యులు సమావేశమయ్యారని, కొవిడ్ విజృంభణకు ఇది కూడా ఒక కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా సంస్థల్లో ఇటువంటి వార్తల ప్రసారం విస్తృతంగా జరిగింది. ఇటువంటి తప్పుడు వార్తల ప్రసారాన్ని నిలుపు చేయాలంటూ కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ జమాయిత్ ఉలేమా ఏ హింద్ సహా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఆ ఫేక్ న్యూస్‌కు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. వాటిని విచారించిన ధర్మాసనం.. ‘‘ఈ దేశంలో ఒక వర్గం మీడియా ప్రతి విషయాన్నీ మతం కోణంలో చూడడమే అసలు సమస్య. దానివల్ల, చివరికి దేశానికి చెడ్డపేరు వస్తోంది. ఈ ప్రైవేటు చానళ్లను నియంత్రించడానికి మీరు (కేంద్రం) ఎప్పుడైనా ప్రయత్నించారా? ఈ సోషల్ మీడియా, ట్విటర్, ఫేస్‌బుక్ సామాన్యుల సమస్యలకు స్పందించినట్లు నేనెక్కడా చూడలేదు. వాటికి బాధ్యత లేదు. న్యాయ వ్యవస్థ పట్ల వాటికి జవాబుదారీతనం లేదు. సంస్థలను అప్రదిష్ఠ పాల్జేస్తూ అవి ఇష్టం వచ్చినట్లు రాస్తాయి. పైగా, తర్వాత స్పందించవు.
అలా రాయడం తమ హక్కు అంటాయి. న్యాయమూర్తులు, సంస్థలు, సామాన్యుల గురించి ఆందోళన లేదు. ఆందోళనంతా బలవంతుల గురించే. ఇప్పటి వరకూ మా అనుభవం.. మా దృష్టికి వచ్చింది కూడా ఇదే’’ అని జస్టిస్ రమణ వ్యాఖ్యానించారు. వెబ్ పోర్టళ్లు, యూట్యూబ్ చానళ్లలో ప్రసారమయ్యే ఫేక్ న్యూస్, నిందలు, దూషణలపై ఎవరికీ నియంత్రణ లేదని తప్పుబట్టారు. యూట్యూబ్ చూస్తే చాలు.. బూటకపు వార్తలు ఎంత విచ్చలవిడిగా ప్రసారమవుతున్నాయో అర్థమవుతుందని, ఇప్పుడు ఎవరైనా యూట్యూబ్‌లో చానల్ ప్రారంభించుకోవచ్చని వ్యాఖ్యానించారు. శక్తిమంతులు చెప్పినట్లు సోషల్ మీడియా నడుచుకుంటోందని, కనీస బాధ్యత కూడా లేకుండా న్యాయమూర్తులు, సంస్థలకు వ్యతిరేకంగా రాస్తోందని తప్పుబట్టారు. సోషల్ మీడియాలో అటువంటి కంటెంట్ నియంత్రణకు ఏదైనా కమిషన్‌ను ఏర్పాటు చేశారా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. కేవలం మత రంగు పులమడమే కాదని, వాటిలో వార్తలను సృష్టిస్తున్నారని కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. వెబ్ పోర్టళ్లు సహా ఆన్‌లైన్‌లో కంటెంట్‌ను నియంత్రించడానికి ఐటీ నిబంధనలను రూపొందించామని కోర్టుకు తెలిపారు. ఆన్‌లైన్ కంటెంట్‌కు సంబంధించి రూపొందించిన కొత్త ఐటీ రూల్స్ చెల్లుబాటుపై వివిధ హైకోర్టుల్లో పిటిషన్లు పెండింగులో ఉన్నాయని, వాటిని కూడా సుప్రీం కోర్టుకు బదలాయిస్తే సమగ్ర అవగాహన కలుగుతుందంటూ కేంద్రం చేసిన వినతిని ధర్మాసనం అంగీకరించింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.