చెక్ బౌన్స్ కేసుల విచారణకు అదనపు కోర్టులు ఏర్పాటు చేస్తారా?
ABN , First Publish Date - 2021-02-26T09:23:48+05:30 IST
చెక్ బౌన్స్ కేసుల విచారణకు అదనపు కోర్టులు ఏర్పాటు చేస్తారా?

కేంద్రాన్ని వివరణ కోరిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: దేశవ్యాప్తంగా చెక్ బౌన్స్ అపరిష్కృత కేసులు 35 లక్షలు దాటి పోయాయని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు, కేసులను వేగంగా పరిష్కరించేందుకు అదనపు కోర్టులు ఏర్పాటు చేస్తారా? అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 247 ప్రకారం అదనపు కోర్టులు ఏర్పాటు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందో లేదో తెలుసుకొని, వచ్చే వారానికల్లా తమకు చెప్పాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్.రవీంద్రభట్‌ల ధర్మాసనం గురువారం అదనపు సొలిసిటర్ జనరల్ విక్రమ్‌జీత్ బెనర్జీని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ వివరణ తీసుకొని తదుపరి విచారణ నాటికి కోర్టుకు తెలియజేస్తానని బెనర్జీ తెలిపారు. కోర్టులపై చెక్ బౌన్స్ కేసుల భారం తగ్గించేందుకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే విషయమై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది.