విద్యార్థులు ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తే డ్రైవర్‌, కండక్టర్లపై చర్యలు

ABN , First Publish Date - 2021-12-09T16:21:36+05:30 IST

విద్యార్థులను బస్సుల్లో ఫుట్‌బోర్డు ప్రయాణం చేయడానికి అనుమతిస్తే డ్రైవర్‌, కండక్టర్లపై చర్యలు చేపడతామని రవాణా శాఖ హెచ్చరించింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలలు

విద్యార్థులు ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తే డ్రైవర్‌, కండక్టర్లపై చర్యలు

                     - రవాణా శాఖ హెచ్చరిక


పెరంబూర్‌(చెన్నై): విద్యార్థులను బస్సుల్లో ఫుట్‌బోర్డు ప్రయాణం చేయడానికి అనుమతిస్తే డ్రైవర్‌, కండక్టర్లపై చర్యలు చేపడతామని రవాణా శాఖ హెచ్చరించింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం ఉంది. ఈ క్రమంలో, పాఠశాలకు వెళ్లే సమయాల్లో తగినన్ని బస్సులు లేకపోవడంతో విద్యార్థులు ఫుట్‌బోర్డు, కిటికీలు పట్టుకొని ప్రయాణిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై రవాణాశాఖ తీవ్రంగా స్పందించింది. రద్దీ అధికంగా వుండే మార్గాల్లో అదనపు బస్సులు నడపాలని, విద్యార్థులు ఫుట్‌బోర్డు ప్రయాణం చేయకుండా కండక్టర్లు, డ్రైవర్లు నిరోధించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి చర్యలు పునరావృత్తమైతే కండక్టర్లు, డ్రైవర్లపై చర్యలు చేపడతామని రవాణా శాఖ హెచ్చరించింది.


9 మంది విద్యార్థులపై కేసు

తిరువళ్లూర్‌ జిల్లాలో రెండురోజుల క్రితం బస్సులో ఫుట్‌ బోర్డు ప్రయాణం చేస్తూ ప్రయాణికులకు ఇబ్బంది కలిగించిన 9 మంది కళాశాల విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఊత్తుకోట సమీపం మెయ్యూర్‌కు వెళ్లే బస్సులో కొందరు విద్యార్థులు ఫుట్‌బోర్డు, కిటీకీలు పట్టుకొని ప్రయాణిస్తూ, రోడ్డుపై కాళ్లు చాపి ప్రమాదకరంగా ప్రయాణించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వెలువడ్డాయి. దీంతో, సదురు విద్యార్థులు, తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు వారిని హెచ్చరించి పంపించారు. అదే సమయంలో మంగళవారం పెరియకుప్పం ప్రాంతంలో పోలీసులు గస్తీ పనులు చేపట్టగా, 8 మంది విద్యార్థులను అడ్డుకొని తనిఖీ చేయగా, వారి వద్ద రెండున్నర అడుగుల పొడవున్న పట్టా కత్తి లభించడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Updated Date - 2021-12-09T16:21:36+05:30 IST