ప్రజాసమస్యలపై ఉధృతంగా ఉద్యమాలు: శ్రీనివాసరావు

ABN , First Publish Date - 2021-10-25T06:20:40+05:30 IST

దేశంలో ప్రజా సమస్యలపై ఉధృతంగా ఉద్యమించాలని, ధరల పెరుగుదలపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించామని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీ శ్రీనివాసరావు తెలిపారు.

ప్రజాసమస్యలపై ఉధృతంగా ఉద్యమాలు: శ్రీనివాసరావు

న్యూఢిల్లీ, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): దేశంలో ప్రజా సమస్యలపై ఉధృతంగా ఉద్యమించాలని, ధరల పెరుగుదలపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించామని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీ శ్రీనివాసరావు తెలిపారు. 28న ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యమించబోతున్నామని, మిగితా రాష్ట్రాల్లోనూ ఇతర వామపక్ష పార్టీలు, ప్రగతిశీల పార్టీలను కలుపుకొని పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. మూడు రోజుల పాటు జరిగిన ఆ పార్టీ కేంద్ర కమిటీ సమావేశాలు ముగిసిన సందర్భంగా ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఉపాధి అవకాశాలు పడిపోయాయని, ధరలు తీవ్ర స్థాయిలో పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోల్‌, డీజిల్‌పై విధిస్తున్న పన్నులను వ్యాక్సినేషన్‌ కోసం ఉపయోగిస్తున్నామని బీజేపీ నేతలు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాగా, వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునేంత వరకు ఉద్యమాన్ని నిర్మించాలని నిర్ణయించామని శ్రీనివాసరావు తెలిపారు.

Updated Date - 2021-10-25T06:20:40+05:30 IST