తమిళనాడు జాలర్లను అరెస్ట్ చేసిన శ్రీలంక నేవీ
ABN , First Publish Date - 2021-12-19T20:09:12+05:30 IST
తమిళనాడుకు చెందిన 43 మంది మత్స్యకారులను శ్రీలంక
రామేశ్వరం : తమిళనాడుకు చెందిన 43 మంది మత్స్యకారులను శ్రీలంక నావికా దళం అరెస్ట్ చేసింది. వీరు ప్రయాణిస్తున్న 6 పడవలను స్వాధీనం చేసుకుంది. అరెస్టయిన మత్స్యకారులను కంగెసంతురాయ్ శిబిరానికి తీసుకెళ్లింది. ఈ వివరాలను తమిళనాడు మత్స్య శాఖ అధికారి ఒకరు ఆదివారం ప్రకటించారు.
అరెస్టయిన మత్స్యకారులను వెంటనే విడుదల చేయాలని మత్స్యకారుల సంఘం డిమాండ్ చేసింది. వీరిని వెంటనే విడుదల చేయకపోతే సోమవారం ధర్నా, నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించింది.
మత్స్యశాఖ అధికారి ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, తమిళనాడు మత్స్యకారులు డిసెంబరు 18న 500కు పైగా పడవల్లో చేపల వేటకు బయల్దేరారు. వీరిలో 43 మందిని శ్రీలంక నావికా దళం అరెస్టు చేసి, ఆరు పడవలను స్వాధీనం చేసుకుంది.
మత్స్యకారులను, వారి పడవలను విడుదల చేయించాలని కేంద్ర మంత్రులను రామనాథపురం ఎంపీ కే నవస్ కని కోరారు.