అమెజాన్ మోస్ట్ పాపులర్ బుక్‌గా ‘మనోడి’ పుస్తకం

ABN , First Publish Date - 2022-01-01T01:05:34+05:30 IST

దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఈ నెల 28 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఓటింగులో విశాఖపట్టణానికి..

అమెజాన్ మోస్ట్ పాపులర్ బుక్‌గా ‘మనోడి’ పుస్తకం

విశాఖపట్నం: దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఈ నెల 28 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఓటింగులో విశాఖపట్టణానికి చెందిన శ్రీధర్ బెవర రాసిన ‘ద రోలింగ్ ల్యాంబ్స్’ పుస్తకం 2021 సంవత్సరానికి గాను అమెజాన్ మోస్ట్ పాపులర్ బుక్‌గా ఎంపికైంది.


అమెజాన్ ప్రతి సంవత్సరం ఒక్కో విభాగంలో ఐదు పుస్తకాలను ‘అమెజాన్ మోస్ట్ పాపులర్ బుక్ ఆఫ్ ద ఇయర్’గా ఎంపిక చేసేందుకు ఓటింగ్ నిర్వహిస్తుంటుంది. ఈ పుస్తకాల్లో భారతీయ భాషా కేటగిరి, పిల్లల విభాగం, రొమాన్స్, యంగ్ అడల్ట్, బయోగ్రఫీస్ అండ్ మెమొరీస్, బిజినెస్ అండ్ ఎకనమిక్స్, క్రైం, థ్రిల్లర్ అండ్ మిస్టరీ, సెల్ఫ్ హెల్ప్, లిటరేచర్ అండ్ ఫిక్సన్ వంటి తొమ్మిది విభాగాల్లో ఐదేసి పుస్తకాలను ఎంపిక చేసి ఓటింగ్ ప్రక్రియ నిర్వహించింది.


ఈసారి ఎంపిక చేసిన పుస్తకాల్లో రాబిన్‌శర్మ, చేతన్ భగత్, స్టీఫెన్ కింగ్, జెఫ్రీ ఆర్చర్, కెన్ ఫొల్లెట్, బ్రాడ్ స్టోన్, మ్యాథ్యూ బ్రెనన్, కబీర్ బేడీ, ప్రియాంక చోప్రా జొనాస్, రెయిన్ బో రోవెల్, కొలిని హోవర్, రస్కిన్ బాండ్, సుధామూర్తి, మానవ్ కౌల్, సంజీవ్ పాలైవాల్ వంటి రచయితలు రాసిన పుసక్తాలు కూడా ఈసారి పోటీపడ్డాయి.


వీటన్నింటినీ తోసిరాజని బిజినెస్ అండ్ ఎకనమిక్స్ విభాగంలో విశాఖ వాసి శ్రీధర్ బెవర రాసిన 'ద రోరింగ్ లాంబ్స్' పుస్తకం విజేతగా నిలిచింది. ఈ విభాగంలో శ్రీధర్ ఒక్కరే భారతీయ రచయిత కావడం గమనార్హం.


అమెరికన్ పబ్లిషింగ్ సంస్థ హార్పర్ కాలిన్స్ ప్రచురించిన ఈ పుస్తకం ఇప్పటికే బెస్ట్ సెల్లర్‌గా రికార్డులకెక్కింది. టైమ్స్ ఆఫ్ ఇండియా, అవుట్ లుక్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, మిడ్ డే, ప్రింట్ ఇండియా, ఖలీజ్ టైమ్స్, గల్ఫ్ టుడే, యాహూ ఫైనాన్స్ లాంటివి ఈ పుస్తకంపై ప్రశంసలు కురిపించాయి. శ్రీధర్ గతంలో రాసిన పలు పుస్తకాలు కూడా అంతర్జాతీయ ఖ్యాతినార్జించాయి. 2018లో విడుదలైన ‘మూమెంట్ ఆఫ్ సిగ్నల్’ పుస్తకం అంతర్జాతీయంగా పలువురి ప్రశంసలు అందుకుంది.


శ్రీధర్ బెవర రాసిన పుస్తకాలతో కదిలిపోయిన కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్, పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ వంటివారు శ్రీధర్‌ను ప్రశంసించారు. శ్రీధర్ చేతుల మీదుగా రెండు బెస్ట్ సెల్లర్స్‌ను అందుకున్న శశిథరూర్.. ఎన్నో కష్టాలకు ఎదురొడ్డి పేదరికం నుంచి ఈ స్థాయికి ఎదిగిన శ్రీధర్ జీవితం తనకు స్ఫూర్తిదాయకమని, అదే తనను ఈ పుస్తకాలు చదవమని తనను ప్రేరేపిస్తుందని పేర్కొన్నారు.

Updated Date - 2022-01-01T01:05:34+05:30 IST